‘అభినందన్‌ దగ్గర గన్‌ లేకుంటే కొట్టి చంపేవాళ్లం’

Pakistanis Recall IAF Pilot Abhinandan Intelligence - Sakshi

న్యూఢిల్లీ : శత్రు దేశ సైన్యానికి పట్టుబడినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తన కర్తవ్యాన్ని నెరవేర్చిన భారత వైమానిక దళ పైలట్‌ అభినందన్‌పై యావత్‌ భారతావని ప్రశంసలు కురిపిస్తోంది. అసలైన సైనికుడు అంటూ కొనియాడుతోంది. పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో.. పాక్‌ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్‌ విమానం కూలిపోగా...ఆయన పాక్‌ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ భారత్‌కు చేరుకున్నారు కూడా. అయితే పాక్‌ సైన్యానికి చిక్కడానికి ముందు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో అభినందన్‌ ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఇండియా టుడే ఆరా తీసింది.(అభినందన్‌ ఆగయా..)

ఈ నేపథ్యంలో స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం... మిగ్‌-21 విమానం కూలిపోగానే అభినందన్‌ పారాచూట్‌ సాయంతో హోరన్‌ గ్రామంలో దిగారు. ఈ విషయం గురించి మహ్మద్‌ కమ్రాన్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ... ‘ గాల్లో ఆరు విమానాలు తలపడటం నేను చూశాను. అందులో ఒకటి ఇండియా వైపు నుంచి వచ్చింది. నాకు తెలిసి పాకిస్తాన్‌ వైమానిక దళం ఆ విమానాన్ని వెంబడించింది. అప్పుడే ఆ విమానం కూలిపోయింది. అందులో నుంచి ఓ వ్యక్తి పక్షిలా కిందకు వచ్చాడు. అతడు పారాచూట్‌ తెరవడం నేను చూశాను. దానిపై భారత జెండా ఉంది. సమీపంలో ఉన్న కొండ మీద దిగగానే.. ఎక్కడ ఉన్నానో అన్న విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించినట్టు అనిపించింది. మెల్లగా కిందకి దిగి ఇది ఇండియానా .. పాకిస్తానా అని అడిగాడు. ఇండియా అని చెప్పగానే మన ప్రధాని ఎవరు అని అడిగాడు’ అని చెప్పుకొచ్చాడు.(ఎవరీ విక్రమ్ అభినందన్‌?)

రాళ్లతో కొట్టి చంపేవాళ్లం..
తాను శత్రు సైన్యానికి చిక్కానని గ్రహించిన అభినందన్‌ వెంటనే తుపాకీ బయటకు తీశారు. అంతేకాదు తన దగ్గర ఉన్న కొన్ని పత్రాలను మింగేశారు. మరికొన్నింటిని ముక్కలుగా చేసి నీటిలో కలిపేస్తూ భారత్‌ మాతా కీ జై అని నినదించారు. అయితే ఇదంతా గమనించిన స్థానిక యువత అభినందన్‌ను రాళ్లతో కొట్టడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పాకిస్తాన్‌ సైన్యం ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ విషయం గురించి చెబుతూ... ‘ భారత పైలట్‌ నినాదాలు చేయగానే మాకు భయం వేసింది. అతడి దగ్గర గనుక తుపాకీ లేకపోయి ఉంటే రాళ్లతో కొట్టి చంపేవాళ్లం. అంతేకాదు మాపై అతను దాడి చేయకపోవడం కూడా మంచిది అయింది. లేదంటే అక్కడున్న మూక చేతిలో హతమయ్యేవాడే. తెలివిగా ఆలోచించి తన ప్రాణాలతో పాటు మా ప్రాణాలు కూడా అపాయంలో పడకుండా చేశాడు’ అని వ్యాఖ్యానించాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top