సరిహద్దులో బరితెగించిన పాక్‌ | Pak shelling leaves two dead in Jammu and Kashmir's Rajouri distric | Sakshi
Sakshi News home page

సరిహద్దులో బరితెగించిన పాక్‌

May 14 2017 2:01 AM | Updated on Oct 2 2018 2:30 PM

సరిహద్దులో బరితెగించిన పాక్‌ - Sakshi

సరిహద్దులో బరితెగించిన పాక్‌

జమ్మూ కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంట పాక్‌ బలగాలు మరోసారి బరి తెగించాయి.

రాజౌరీలో భారీగా కాల్పులు..ఇద్దరు పౌరుల మృతి
► కాల్పుల్ని దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం
► సురక్షిత ప్రాంతాలకు సరిహద్దు గ్రామాల ప్రజల తరలింపు
► నిరవధికంగా స్కూళ్ల మూసివేత


జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంట పాక్‌ బలగాలు మరోసారి బరి తెగించాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం ఉదయం నుంచి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడడంతో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు స్కూళ్లకు నిరవధికంగా సెలవు ప్రకటించారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని తుఫైల్‌ హుస్సేన్‌(51), అసియా బీ(13)లుగా గుర్తించారు. మే 10 నుంచి పాకిస్తాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది మూడోసారి.

ఈ కాల్పుల్లో ఇంతవరకూ ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ఆటోమెటిక్‌ ఆయుధాలు, 82 ఎంఎం, 120 ఎంఎం మోర్టార్లతో శనివారం ఉదయం 7.15 గంటల నుంచి కాల్పులకు తెగబడ్డారని, పాక్‌ కాల్పులకు భారత సైన్యం దీటుగా బదులిచ్చిందని రక్షణ శాఖ పీఆర్వో లెఫ్టినెంట్‌ కల్నల్‌ మనీష్‌ మెహతా చెప్పారు. రాజౌరీలో ఎల్వోసీ వెంట నివసిస్తున్న 270 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, జన్‌గఢ్‌ ప్రాంతం నుంచి 400 మందిని తరలించేందుకు ఆరు బస్సుల్ని ఏర్పాటు చేసినట్లు రాజౌరీ డిప్యూటీ కమిషనర్‌ షాహిద్‌ చౌదరి చెప్పారు.

మొత్తం మూడు శిబిరాలు ఏర్పాటు చేశామని, గాయపడ్డవారిని చికిత్స కోసం తరలించేందుకు ఆరు అంబులెన్స్‌లు, ఒక మొబైల్‌ వాహనం నౌషెరాలో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. రాజౌరీలోని షేరీ మకేరీ, జన్‌గఢ్, భవానీ, లామ్‌ ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్తాన్‌ దళాలు కాల్పులు జరిపాయని, ముందుజాగ్రత్తగా జిల్లాలో నియంత్రణ రేఖ వెంట స్కూళ్లను మూసివేశామని, సరిహద్దు గ్రామాల్లో ప్రజల్ని తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఏడాదిలో 268 సార్లు ఉల్లంఘనలు
మే 11న రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వెంట పాక్‌ కాల్పుల్లో ఒక మహిళ మృతిచెందడంతో పాటు ఇద్దరు  గాయపడ్డారు. అనంతరం స్కూళ్లను రెండ్రోజుల పాటు మూసివేశారు. అయితే కాల్పులు కొనసాగుతుండడంతో నిరవధికంగా స్కూళ్లను మూసివేశామని డిప్యూటీ కమిషనర్‌ వెల్లడించారు. బాలాకోట్, పూంచ్‌ సెక్టార్లలో కూడా స్కూళ్లను మూసివేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ప్రజల్ని అధికారులు కోరారు. సరిహద్దు గ్రామాల నుంచి దాదాపు 1500 మందికిపైగా ప్రజల్ని తరలించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గత ఏడాది కాలంలో పాకిస్తాన్‌ 268 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం గత నెల్లో రాజ్యసభలో వెల్లడించింది.

లష్కరే కుట్ర భగ్నం.. ఏడుగురు ఉగ్రవాదుల అరెస్టు
కశ్మీర్‌లోని చినాబ్‌ లోయలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు లష్కరే తోయిబా ముఠా చేస్తున్న కుట్రను శనివారం పోలీసులు భగ్నం చేసి ఏడుగురు అరెస్టుచేశారు. వారిలో ఒక పోలీసు అధికారి(ఎస్పీవో) ఉన్నారు. నిఘా సమాచారంతో దోడాలో కొందర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... ఉగ్రవాదుల వివరాలు వెల్లడయ్యాయని తర్వాత వారిని అరెస్టు చేసినట్లు జమ్ము ఐజీ తెలిపారు.  

దక్షిణకశ్మీర్‌లో 100 మంది ఉగ్రవాదులు!
బెహిబాగ్‌: ఉగ్రవాద కార్యకలాపాలు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్న దక్షిణ కశ్మీర్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నారని భారత ఆర్మీ వెల్లడించింది. వారిలో ఎక్కువమంది స్థానిక యువకులేనని తెలిపింది. ఉగ్రవాదులను అంతమొందించేందుకు ఆపరేషన్లు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. ఇటీవల షోపియాన్‌లో జరిపినట్లుగా పూర్తిస్థాయిలో కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నట్లు దక్షిణ కశ్మీర్‌ ఆర్మీ ఉన్నతాధికారి మేజర్‌ జనరల్‌ బీఎస్‌ రాజు వెల్లడించారు.

ప్రస్తుతానికి పరిస్థితి నియంత్రణలోనే ఉందన్నారు. ఉగ్రవాదుల చేతిలో హతమైన లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఉమర్‌ ఫయాజ్‌ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కశ్మీర్‌ లోయలోని యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులవ్వకుండా రాష్ట్ర పోలీసులతో కలసి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. లోయలో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని.. 95 శాతం ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా నడుస్తున్నాయన్నారు. ‘నాలుగైదు కాలేజీల్లోని 40–50 మంది విద్యార్థులే అల్లర్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement