
కేంద్రం మొద్దు నిద్ర: నరేంద్ర మోడీ
దేశ సరిహద్దులను కాపాడటంలో యూపీఏ ప్రభుత్వం ఉదాశీన వైఖరి కనబరుస్తోందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దుయ్యబట్టారు.
అహ్మదాబాద్: దేశ సరిహద్దులను కాపాడటంలో యూపీఏ ప్రభుత్వం ఉదాశీన వైఖరి కనబరుస్తోందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దుయ్యబట్టారు. సరిహద్దులో ఓవైపు చైనా దురాక్రమణలకు పాల్పడుతున్నా మరోవైపు పాకిస్థాన్ దాడులకు తెగబడుతున్నా మన్మోహన్ సర్కారు మొద్దునిద్ర పోతోందని ధ్వజమెత్తారు.
కేంద్రం ఈ వైఖరిని ఎప్పుడు మార్చుకుంటుందని ప్రశ్నించారు. పాకిస్థాన్ సైనికులు భారత భూభాగంలోకి చొరబడి ఐదుగురు జవాన్లను కాల్చి చంపడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ‘ట్విట్టర్’లో వ్యాఖ్యానించారు. మరోవైపు పాక్ కాల్పుల ఘటన నేపథ్యంలో అమెరికాలో త్వరలో జరగనున్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వసభ్య సమావేశంలో భాగంగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మన్మోహన్ చర్చలు జరపరాదని బీజేపీ నేత యశ్వంత్‌సిన్హా డిమాండ్ చేశారు. పాక్‌తో చర్చల విషయంలో భారత్ కఠిన వైఖరి అవలంబించాలని బీజేపీ నేతలు వెంకయ్య నాయుడు, షానవాజ్ హుస్సేన్ సూచించారు.