న్యాయం గుడ్డిదేగానీ మరీ ఇంతా......

Nine Years After Mangaluru Pub Attack: Pramod Muthalik acquitted - Sakshi

సాక్షి, బెంగళూరు: మంగళూరులోని ఓ పబ్‌లో ఓ యువకుల బృందం దౌర్జన్యంగా యువతుల జుట్టు పట్టుకొని కొట్టడం, వారు కింద పడిపోవడం, పారిపోయేందుకు ప్రయత్నించడం లాంటి దశ్యాలు 2009, జనవరి 24వ తేదీన దేశవ్యాప్తంగా టీవీ ఛానళ్లలో విస్తృతంగా ప్రసారం అయ్యాయి. దెబ్బలు తిన్న మహిళలు పబ్‌కు మద్యం సేవించేందుకు వచ్చిన వినియోగదారులని, దౌర్జన్యంగా దెబ్బలు కొట్టిన వారంతా  కర్ణాటకలో హిందూ సంస్థగా పేరుపొందిన ‘శ్రీరామ్‌ సేన’ సభ్యులని పోలీసులతోపాటు సమాజమూ గుర్తించింది.

మహిళలు పబ్‌లకు వెళ్లడమంటే సంస్కృతిపై దాడి చేయడమేనని, అందుకనే వారికి తగిన శాస్తి జరిగిందంటూ శ్రీరామ్‌ సేన చీఫ్‌ ప్రమోద్‌ ముతాలిక్‌ నాడు సంఘటనను సమర్థిస్తూ వ్యాఖ్యానించారు. ఈ దాడికి పాల్పడిందీ తామేనంటూ ఇటు శ్రీరామ్‌ సేన, అంటూ భజరంగ్‌ దళ్‌ సంస్థలు పోటా పోటీగా ప్రకటించుకున్నాయి. తమ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని, ఇందులో భజరంగ్‌ దళ్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ శ్రీరామ్‌ సేన జిల్లా కన్వీనర్‌ కుమార్‌ మాలేమర్‌ బహిరంగ ప్రకటన చేశారు.

ఈ సంఘటనను జాతీయ మహిళా కమిషన్‌కు కూడా తీవ్రంగా పరిగణించడంతో పోలీసులు కేసు నమోదు చేసి 30 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో ప్రమోద్‌ ముతాలిక్‌ కూడా ఉన్నారు. ఆయన 2014 పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు ఆయన్ని పార్టీలోకి ఎలా తీసుకుంటారని బీజేపీ జాతీయ నాయకత్వం ప్రశ్నించడంతో బీజేపీ కర్ణాటక శాఖ వెంటనే ఆయన్ని పార్టీ నుంచి తొలగించింది. దాదాపు 9 ఏళ్ల అనంతరం ఈ సంఘటనపై మంగళూరులోని ఫస్ట్‌క్లాస్‌ కోర్టుకు చెందిన థర్డ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ (12.03.18) సోమవారం నాడు  తీర్పు చెప్పారు. నిందితులు నిర్దోషులంటూ 30 పేజీల తీర్పును చదివారు.

‘ఈ కేసులో నిందితుల నేరాన్ని రుజువు చేసేందుకు దర్యాప్తు అధికారులు మహిళా వినియోగదారులను కోర్టు ముందు ప్రవేశపెట్టలేక పోయారు. చార్జిషీటులో వారిని సాక్షులుగా చూపలేదు. ఈ కేసులో మహిళా వినియోగదారులే బాధితులు. వారే మంచి సాక్షులు కూడా అవుతారు. వారిని దర్యాప్తు అధికారులు విచారించి ఉంటే నిజం బయటకు వచ్చేది. ఈ కేసులో ఫొటోలు, వీడియోలు చాలా ముఖ్యమైన సాక్ష్యాధారాలు. వాటిని దర్యాప్తు అధికారులు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టలేక పోయారు. ఇలాంటి సాక్ష్యాధారలు చూపక పోవడం ఈ కేసుకు ప్రాణాంతకంగా మారింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడంలో చాలా జాప్యం జరిగింది. జాప్యానికి కారణాలు కూడా వివరించలేదు.

ఓ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ జడ్జిమెంట్‌ ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడంలో జరిగే జాప్యం కూడా కేసు మరణానికి కారణం అవుతుంది. నేరం రుజువు కానందున ఈ కేసులో నిందితులంతా నిర్ధోషులే’ అంటూ కోర్టు తీర్పు చెప్పింది. ‘మమ్మల్ని వ్యతిరేకించిన వారికి, మమ్మల్ని గూండాలని దూషించిన వారికి ఈ తీర్పు ఓ సమాధానం’ అని తీర్పు పట్ల ప్రమాద్‌ ముతాలిక్‌ వ్యాఖ్యానించగా, న్యాయం గుడ్డిదని తెలుసుకానీ, మరింత గుడ్డిదని తెలియదని కొందర సామాజిక కార్యకర్తలు వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు పాఠం చదివితే చాలు, ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేకుండానే న్యాయం ఏమిటో పాఠకులకు బోధపడుతుంది. దర్యాప్తులో ఘోరంగా విఫలమైన దర్యాప్తు అధికారులను దోషిగా ఎందుకు ప్రకటించలేదో ఎందరికి అర్థం అవుతుంది?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top