పాకిస్తాన్‌కు వెళ్లిపోండి! | Muslim Family Attacked by Mob | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు వెళ్లిపోండి!

Mar 25 2019 3:16 AM | Updated on Mar 25 2019 3:17 AM

Muslim Family Attacked by Mob - Sakshi

గురుగ్రామ్‌: హోలీ పండుగ రోజున  హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ ముస్లిం కుటుంబంపై దాదాపు 25 మంది దుండగులు దాడి చేసి ‘మీరంతా పాకిస్తాన్‌ వెళ్లిపొండి’ అని బెదిరించారు. పోలీసులు ఇప్పటివరకూ దాడికి పాల్పడ్డ నిందితులందరినీ అరెస్ట్‌ చేయకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. యూపీలోని భాగ్‌పట్‌ జిల్లాకు చెందిన సాజిద్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి హరియాణాలోని ధుమస్‌పూర్‌ గ్రామంలో సొంతిల్లు కట్టుకని ఉంటున్నారు. గురువారం హోలీ రోజున సాజిద్, అతని చుట్టాల పిల్లలు ఇంటి దగ్గర్లో ఆడుకుంటున్నారు. అక్కడకు బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు..‘ఏయ్‌.. ఇక్కడ మీరేం చేస్తున్నారు? పాక్‌కు వెళ్లి క్రికెట్‌ ఆడుకోండి’ అని అవమానించారు.

దీన్ని గమనించిన సాజిద్‌ అక్కడకు వెళ్లి ఇద్దరు యువకులను నిలదీయడంతో ఆయనపై దాడిచేశారు. తర్వాత కర్రలు, కత్తులు, రాడ్లతో చేరుకున్న 20–25 మంది సాజిద్‌ ఇంట్లోకి దూసుకొచ్చి దాడిచేశారు. చివరకు ఇంట్లోని విలువైన వస్తువులను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనను పలు రాజకీయపార్టీలు ఖండించాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ మహేశ్‌ కుమార్‌(24) నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీపీ దినేశ్‌ శర్మ తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. మరోవైపు ఈ దాడికి పాల్పడిన దుండగుల్ని ఆదివారంలోగా అరెస్ట్‌ చేసి చర్యలు తీసుకోకపోతే పోలీస్‌ కమిషనర్‌ను ఆశ్రయిస్తామని ముస్లిమ్‌ ఏక్తా మంచ్‌ హెచ్చరించింది. 

Advertisement
 
Advertisement
Advertisement