లోక్‌సభలో సోమవారం తమతమ పార్టీలు జారీచేసిన విప్ గండం నుంచి ముగ్గురు తెలంగాణ ఎంపీలు గట్టెక్కగలిగారు.
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో సోమవారం తమతమ పార్టీలు జారీచేసిన విప్ గండం నుంచి ముగ్గురు తెలంగాణ ఎంపీలు గట్టెక్కగలిగారు. లోక్‌సభలో జీఎస్టీ బిల్లుకు సంబంధించి ఓటింగ్ కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. అందులో భాగంగానే కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ, టీఆర్‌ఎస్ పార్టీలు కూడా తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీడీపీ నుంచి మల్లారెడ్డి, వైఎస్సార్ సీపీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి విదితమే.
సాంకేతికంగా ఆ ముగ్గురు ఎంపీలు తాము ఎన్నికల్లో గెలిచిన పార్టీకి చెందిన సభ్యులుగానే లోక్‌సభలో కొనసాగుతున్నారు. అయితే ఏఐడీఎంకే మినహా అన్ని రాజకీయ పార్టీలు జీఎస్టీ బిల్లుకు మద్దతు ప్రకటించడంతో గుత్తా, మల్లారెడ్డి, పొంగులేటిలు విప్ గండం నుంచి తప్పించుకోగలిగారు. కాగా తాను రెండు, మూడు నెలల్లో లోక్‌సభకు రాజీనామా చేస్తానని గుత్తా పార్లమెంట్‌లో సహచర ఎంపీలకు తెలిపారు.