అప్పుడే కొత్త పల్లవి అందుకున్న కావూరి | MP kavuri Sambasiva Rao may migrate to BJP | Sakshi
Sakshi News home page

అప్పుడే కొత్త పల్లవి అందుకున్న కావూరి

Apr 4 2014 11:22 AM | Updated on Mar 29 2019 9:24 PM

అప్పుడే కొత్త పల్లవి అందుకున్న కావూరి - Sakshi

అప్పుడే కొత్త పల్లవి అందుకున్న కావూరి

కేంద్రమంత్రి పదవికి నిన్న రాజీనామా చేశారో లేదో అప్పుడే కావూరి సాంబశివరావు కొత్త పల్లవి అందుకున్నారు.

కేంద్రమంత్రి పదవికి నిన్న రాజీనామా చేశారో లేదో అప్పుడే కావూరి సాంబశివరావు కొత్త పల్లవి అందుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ సమర్థవంతమైన నాయకుడని అభివర్ణించారు. గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధితో మోడీ సత్తా ఏంటో నిరూపించుకున్నారని కావూరి పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కొద్ది పాటి విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఆలోచన విధానాలేవి పెద్దగా ప్రజలపై ప్రభావం చూపలేదని కావూరి ఈ సందర్బంగా అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వైఖరి తనను తీవ్రంగా కలచివేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి కావూరి గురువారం రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మాత్రం పోటీ చేయనని ఆయన స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. కాగా  రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయింది. ఇప్పటికే ఆ పార్టీలోని మహామహులంతా ఇప్పటికే జంపింగ్ రాగం జపిస్తూ ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు.

ఆ క్రమంలో కావూరి టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. అందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేతలు కావూరి రాకను అడ్డుకున్నారు. దాంతో మరో పార్టీ చూసుకో అంటూ కావూరికి చంద్రబాబు ఉచిత సలహా ఇచ్చారు. దాంతో కావూరి కమలం పార్టీలో వెళ్లాలని చూస్తున్నారు. అందులోభాగంగానే కావూరి బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని ఆకాశానికి ఎత్తుతున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement