
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గు ముఖం పట్టాయి. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ హయాంతో పోలిస్తే.. మోదీ పాలనలో భారీ స్థాయిలో ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఇదే విషయాన్ని గణాంకాలు కూడా నిరూపిస్తున్నాయి.
మన్మోహన్ హయాంలోని 2010 నుంచి 2013 మధ్య కాలంలో జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 1218 ఉగ్రవాద ఘటనలు జరిగాయి. అదే మోదీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2017 మధ్యకాలంలో 1094 ఘటనలు మాత్రమే చోటు చేసుకున్నాయి. 2014 నుంచి ఇప్పటివరకూ భద్రతా బలగాలు.. 580 మంది ఉగ్రవాదును హతమార్చాయి. అదే మన్మోహన్ హాయంలో చివరి నాలుగేళ్లలో 471 మంది టెర్రరిస్టులు మరణించారు.
ఉగ్రవాద ఘటనల్లో కశ్మీరీ పౌరుల మృతుల సంఖ్య కూడా యూపీఏతో పోలిస్తే ఎన్డీఏ పాలనలోనే తక్కువగా నమోదయ్యాయి. యూపీఏ చివరి నాలుగేళ్లలో వంద మంది పౌరులు మృతి చెందారు. ఇదే ఎన్డీఏ పాలనలో 92 మంది చనిపోయారు.