
ప్రచారక్ మోదీ.. ధర్నేబాజ్ కేజ్రీవాల్
‘‘దేశం నినాదాలతో నడవదు. దేశ నిర్మాణంలో త్యాగాలు ఉంటాయి. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల్లో ఇది లేదు.
- సోనియా విమర్శలు
- కొన్ని శక్తులు మత వాతారవణం కలుషితం చేయాలని చూస్తున్నాయి
‘‘దేశం నినాదాలతో నడవదు. దేశ నిర్మాణంలో త్యాగాలు ఉంటాయి. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల్లో ఇది లేదు. ఒకరు ప్రచారక్.. (మోదీని ఉద్దేశించి) ఇంకొకరు ధర్నేబాజ్ (కేజ్రీవాల్ ధర్నాలను ఉద్దేశించి). వారితో ఏమీ జరగదు. ఢిల్లీకి అభివృద్ధి కావాలి. సుపరిపాలన కావాలి. తప్పుడు హామీలు కాదు. అందుకోసం కాంగ్రెస్‌కే ఓటు వేయండి. తప్పుడు హామీలు ఇచ్చేవారి నుంచి ఢిల్లీని కాపాడండి’’ అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఓటర్లను కోరారు.
మంచి పాలన కోసం తాము మద్దతు ఇస్తే నెలన్నరలోనే బాధ్యత మరిచి వెళ్లిపోయిందని ఆప్‌ను విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ... ఢిల్లీలో ఎన్నికలు జరిపించకుండా దాటవేసిందని, రాష్ట్రపతి పాలన ముసుగులో ప్రభుత్వాన్ని నడిపిందని దుయ్యబట్టారు. ఏడాది కాలంలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిపోయిందన్నారు. ‘‘ఢిల్లీ ప్రజల కష్టాలకు బాధ్యులు.. ప్రభుత్వాన్ని నడిపించకుండా వెళ్లిన ఆప్, రాష్ట్రపతి పాలన ముసుగులో అధికారం చెలాయించిన బీజేపీలే. కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనలో షీలా దీక్షిత్ నేతృత్వంలో ఢిల్లీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. మేం 895 అనధికార కాలనీలను క్రమబద్ధీకరించాం’’ అని చెప్పారు.
నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామన్న హామీ ఏమైందని, యువతకు ఉపాధి ఎక్కడ చూపారని మోదీని ప్రశ్నించారు. ఆహార భద్రత చట్టం ద్వారా కేవలం 40 శాతం మందికే లాభం చేకూర్చేలా మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. యజమానులతో సంబంధం లేకుండా భూములు లాక్కునేలా భూసేకరణ చట్టంపై ఆర్డినెన్సు తెచ్చారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన కొన్ని శక్తులు మత వాతావరణాన్ని కలుషితం చేయడానికి కుట్రలు చేస్తున్నాయంటూ.. ఇటీవల ఢిల్లీలో త్రిలోక్‌పురి, దిల్షాన్‌గార్డెన్‌లలో చెలరేగిన ఘర్షణలను ప్రస్తావించారు.