దశావతారాలు! | The Modi government came up with a temporary budget | Sakshi
Sakshi News home page

దశావతారాలు!

Feb 2 2019 3:50 AM | Updated on Feb 2 2019 3:50 AM

The Modi government came up with a temporary budget - Sakshi

పది లక్ష్యాలతో భారతదేశ దశ దిశలో మార్పు తెస్తామంటూ సార్వత్రిక ఎన్నికలవేళ మోదీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌తో జనం ముందుకొచ్చింది. మోదీ ప్రభుత్వం పదిలక్ష్యాలను నిర్దేశించింది. బడ్జెట్‌ని ప్రవేశ పెడుతూ ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ రాబోయే పది ఏళ్లలో 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థకి తాత్కాలిక బడ్జెట్‌తో పునాదివేశారు. ఇది తాత్కాలికం కాదని ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పుకిది నాంది అని ప్రకటించారు. పది లక్ష్యాలతో దారిద్య్రం, పోషకాహార లోపం, నిరక్షరాస్యత, అపరిశుభ్రత లాంటి రుగ్మతలను రూపుమాపి సరికొత్త భారతాన్ని నిర్మించడం, ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రగతిపథంలో మున్ముందుకు సాగడమే ఈ ప్రభుత్వ ఉద్దేశమని పీయూష్‌ గోయల్‌ తెలిపారు.      

1 మౌలిక సదుపాయాల మదుపు
ప్రజా జీవనాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రోడ్లు, రైల్వే, సీపోర్టు, విమానాశ్రయాల అభివృద్ధికి బాటలు వేయడం. దీనికోసం అధికంగా నిధులు కేటాయించింది. గ్రామసడక్‌ యోజనకింద రూ. 19 వేల కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించింది. 

2 డిజిటల్‌ ఇండియా  
సరికొత్త ఆవిష్కరణలతో, నూతన కంపెనీల స్థాపన ద్వారా యువతకు ఉపాధికల్పన. దేశంలో లక్ష గ్రామాలను డిజిటల్‌ విలేజెస్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికల రూపకల్పన. 

3 హరిత భారతం 
ఇంధన అవసరాలకు విదేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ విద్యుత్‌తో నడిచే వాహనాలపై దృష్టి పెట్టి పర్యావరణానికి మేలు చేయడంతో హరిత భారత నిర్మాణానికి బాటలు వేసుకోవడం.  

4 గ్రామీణ భారతానికి దన్ను   
గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వడం. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించి గ్రామీణ భారతాన్ని పారిశ్రామికాభివృద్ధి దిశగా పరుగులు పెట్టించడం.

5 నదుల ప్రక్షాళన
మానవాళికి ప్రధానాధారమైన జలవనరులను కాపాడుకోవడానికీ, భారత ప్రజలందరికీ పరిశుభ్రమైన, రక్షిత మంచినీటిని అందుబాటులోకి తేవడానికి నదులను ప్రక్షాళన చేయడం.  

6 సముద్రాలను జయిద్దాం  
రాబోయే పదేళ్లలో సముద్రతీర ప్రాంతాలను అభివృద్ధి పరచడం. సముద్ర ఆధారిత ప్రాజెక్టుల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవడం. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకోవడం. 

7 అంతరిక్షంలోకి దూసుకెళ్లడం
అంతరిక్ష రంగానికి అత్య«ధిక ప్రాధాన్యతినివ్వడం. అందులో భాగంగానే బడ్జెట్‌ కేటాయింపుల్లో ఈ రంగానికి భారీగా నిధుల కేటాయింపు. 2020 కల్లా భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడం. 

8 పౌష్టికాహారం 
వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఆహారభద్రత అనే దీర్ఘకాలిక లక్ష్యానికి మార్గనిర్దేశనం చేయడం. ఆరోగ్యకరమైన ఆర్గానిక్‌ ఆహారాన్ని పండించుకోవడం ద్వారా స్వయం సమృద్ధిని సాధించడం.  

9 ఆరోగ్యానికి అందలం  
ప్రజల ఆరోగ్యానికి అత్యున్నత స్థానాన్ని కల్పించడం. అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో మారుమూల గ్రామ ప్రజలతో సహా సర్వజనానికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవడం.  

10 సుపరిపాలన  
ప్రజాజీవితంలో ప్రభుత్వ యంత్రాంగం జోక్యం సాధ్యమైనంత వరకూ తగ్గించి, ప్రజలందరికీ సుపరిపాలనా ప్రయోజనాలందించడం, సత్వర స్పందన, బాధ్యతాయుత, స్నేహపూరిత అధికార యంత్రాంగం, ఇ–గవర్నెన్స్‌కు సోపానం వేయడం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement