
హెచ్‌ఐవీ పాజిటివ్ తల్లులకు ‘నెగెటివ్ పిల్లలు’
మిజోరాం రాజధాని ఐజ్వాల్ ప్రభుత్వాసుపత్రిలో 405 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ గర్భిణులకు పుట్టిన పిల్లలకు ఆ వైరస్ సోకలేదు.
ఐజ్వాల్: మిజోరాం రాజధాని ఐజ్వాల్ ప్రభుత్వాసుపత్రిలో 405 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ గర్భిణులకు పుట్టిన పిల్లలకు ఆ వైరస్ సోకలేదు. ఐజ్వాల్ ఆసుపత్రి సిబ్బంది 2011 నుంచి ఈ ఏడాది జూలై వరకు మొత్తం 437 మంది గర్భిణులకు హెచ్‌ఐవీ సోకినట్లు గుర్తించారు.
హెచ్‌ఐవీ ఉన్న గర్భిణులకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి 2005లోనే ఆసుపత్రిలో ప్రత్యేకంగా పీపీటీసీటీసీ (ప్రివెన్షన్ ఆఫ్ పేరెంట్స్ చైల్డ్ ట్రాన్స్‌మిషన్ సెంటర్) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పీపీటీసీటీసీలో కౌన్సెలింగ్‌తో పాటు ఈఐడీ (ఎర్లీ ఇన్‌ఫ్యాంట్ డయాగ్నసిస్), ఎండీఆర్ (మల్టీ డ్రగ్ రెజిమెంట్) చికిత్సలను కూడా హెచ్‌ఐవీ పాజిటివ్ గర్భిణులకు అందించారు.
2011 నుంచి మొత్తం 437 మంది హెచ్‌ఐవీ సోకిన గర్భిణులకు చికిత్స అందించగా వారిలో 32 మందికి మాత్రం చికిత్స విఫలమై శిశువులకు కూడా హెచ్‌ఐవీ సోకింది. 405 మంది చిన్నారులు ఈ వైరస్ బారిన పడలేదు. 32 మంది చిన్నారులకు కూడా చికిత్స అందిస్తున్నామనీ, ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.