కశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్‌ | Massive Encounter in Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్‌

Feb 13 2017 12:45 AM | Updated on Oct 2 2018 2:30 PM

కశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్‌ - Sakshi

కశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్‌

దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా నాగ్బల్‌ గ్రామంలో ఆదివారం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి.

నలుగురు ఉగ్రవాదుల హతం
► అమరులైన ఇద్దరు సైనికులు  
కుల్గాం: దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా నాగ్బల్‌ గ్రామంలో ఆదివారం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వగా, ఇద్దరు జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మరణించారు. మరో ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న ఇంటెలిజెన్స్  సమాచారంతో ఆర్మీ, పోలీస్, పారా మిలటరీ బలగాలు ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు నాగ్బల్‌ గ్రామాన్ని చుట్టుముట్టి ప్రతి ఇంటిని క్షుణ్నంగా తనిఖీ చేశాయి. కానీ ఉగ్రవాదుల ఆచూకీ లభించలేదు. అనంతరం రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్లతో పాటు పోలీసులకు చెందిన స్పెషల్‌ ఆపరేషన్ గ్రూప్‌ మళ్లీ తనిఖీలు నిర్వహించింది.

ఈ సందర్భంగా ఒక ఇంటి పై భాగం అనుమానాస్పదంగా ఉండటాన్ని గుర్తించారు. ఇంతలో జవాన్లు తమని గుర్తించారని భావించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో లాన్స్ నాయక్‌ రఘువీర్‌ సింగ్, లాన్స్ నాయక్‌ గోపాల్‌ సింగ్‌ బదోరియాలు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు  జరిపాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు మరణించగా, మరో ముగ్గురు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. మరణించిన ఉగ్రవాదుల్లో ముగ్గుర్ని ముదసిర్‌ అహ్మద్‌ తాంత్రే, ఫరూక్‌ అహ్మద్, అజహర్‌ అహ్మద్‌గా గుర్తించారు. మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉంది.

కాగా, ఘటనాస్థలి నుంచి నాలుగు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై జమ్మూకశ్మీర్‌ డీజీపీ స్పందిస్తూ.. హిజ్బుల్‌ ముజాహిదీన్ కు చెందిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో విజయం సాధించామని చెప్పారు.  స్థానికులైన ఉగ్రవాదులు మరణించారనే విషయం తెలియడంతో కుల్గాం జిల్లాలో జవాన్లపై అల్లరిమూకలు రాళ్లు రువ్వాయి. జవాన్ల కాల్పుల్లో 15 మంది గాయపడ్డారు. వీరిలో ఒక వ్యక్తి  అనంత్‌నాగ్‌లోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement