ఆరేళ్ల కూతుర్ని రైలులో మరిచిపోయి.. | Man Forgets Daughter In Mumbai Train In Maharashtra | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల కూతుర్ని రైలులో మరిచిపోయి..

Jun 15 2018 2:53 PM | Updated on Jun 15 2018 2:53 PM

Man Forgets Daughter In Mumbai Train In Maharashtra - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై : రైలు దిగే తొందరలో ఉన్నపుడు ఏవైనా వస్తువులు మరిచి వెళ్లిపోవటం మామూలే. కానీ ఓ తండ్రి ఏకంగా తన ఆరేళ్ల కూతురిని రైలులో మర్చిపోయాడు. ఈ సంఘటన బుధవారం మహారాష్ట్రలోని కళ్యాణ్‌ సిటీలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. మహారాష్ట్ర థానే జిల్లాలోని డాంబీవ్లికి చెందిన ఓం ప్రకాశ్‌ హరిపాల్‌ యాదవ్‌ ‘‘సాయినగర్‌- దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌’’ రైలులో షిర్డీ నుంచి కళ్యాణ్‌ సిటీకి బయలు దేరాడు. రైలు కళ్యాణ్‌ సిటీకి చేరుకోగానే భార్య, లగేజీతో సహా రైలు దిగి స్టేషన్‌ బయటకు వెళ్లిపోయాడు.

బయటకు రాగానే ఆరేళ్ల కూతురు లిప్సికా గుర్తుకు వచ్చింది. పాప కోసం చుట్టు పక్కల మొత్తం కలయ తిరిగినా పాప కనిపించలేదు. కొద్ది సేపటి అన్వేషణ తర్వాత కూతురిని రైలు బోగిలో నిద్ర పుచ్చిన సంగతి గుర్తుకు వచ్చింది. పాపకోసం రైలు దగ్గరకి వెళ్లే సరికే రైలు స్టేషన్‌ విడిచి దాదర్‌ వెళ్లిపోయింది. హరిపాల్‌ వెంటనే రైల్వే పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వటంతో వారు గురువారం దాదర్‌లో పాపను గుర్తించి అతనికి అప్పగించారు. 

Advertisement
 
Advertisement
Advertisement