మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు | Madras High Court Says Promotions Based On Reservation Is Unconstitutional | Sakshi
Sakshi News home page

సీనియారిటీ ప్రకారమే పదోన్నతులు 

Nov 17 2019 9:06 AM | Updated on Nov 17 2019 11:51 AM

Madras High Court Says Promotions Based On Reservation Is Unconstitutional - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏళ్ల తరబడి పనిచేస్తున్నా పదోన్నతులు రాక కలతచెందే ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రిజర్వేషన్లకు లోబడి పదోన్నతులు చట్ట విరుద్ధమని మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సీనియారిటీకి అనుగుణంగా పదోన్నతులు కలి్పంచాలని స్పష్టం చేసింది.   రిజర్వేషన్లకు అనుగుణంగా తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేస్తోంది. అలాగే పదోన్నతులు కల్పించడంలోనూ రిజర్వేషన్లను ప్రాతిపదికగా తీసుకుంటోంది. ఈ తరహా పదోన్నతులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్రాసు హైకోర్టులో గతంలో పిటిషన్‌ దాఖలైంది. 

సీనియారిటీ, పనిలో నైపుణ్యాన్ని పక్కనపెట్టి రిజర్వేషన్లకు అనుగుణంగా పదోన్నతులు కల్పించడం వల్ల తాము నష్టపోతున్నామని పిటిషన్‌దారులు వాపోయారు. పదోన్నతి కలి్పంచడంలో రిజర్వేషన్లు పాటించకుండా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. ఉద్యోగాల నియామకంలో రిజర్వేషన్లు పాటించవచ్చు, అయితే పదోన్నతులు కల్పించడంలో కూడా రిజర్వేషన్లను అమలుచేయడం చట్టవిరుద్దమని 2015లో కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. 

అయితే ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో, తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల (పనుల నిబంధన) చట్టంను రాష్ట్ర ప్రభుత్వం 2016లో తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ద్వారా రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కలి్పస్తామని స్పష్టం చేసింది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని, సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జాతీయ రహదారుల శాఖ ఇంజినీర్‌ సెంథిల్‌కుమార్, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ రాజా మద్రాసు హైకోర్టులో మరో పిటిషన్‌ వేశారు. న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, ఆర్‌ఎండీ టిక్కారామన్‌లతో కూడిన డివిజన్‌బెంచ్‌ ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది.  

సీనియారిటినే సరి
పదోన్నతుల విషయంలో సీనియారిటీ ప్రాతిపదికగా తీసుకోవాలని న్యాయమూర్తులు తమ తీర్పులో స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు అనుగుణంగా పదోన్నతులు కల్పిస్తే ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల శాతం మించిపోతోంది, తమిళనాడు రిక్రూంట్‌మెంట్‌ బోర్డు 2003 నుంచీ ఇదే విధానాన్ని అనుసరిస్తోందని  న్యాయమూర్తులు అన్నారు. అందుకే రిజర్వేషన్లకు అనుగుణంగా పదోన్నతులు కల్పించడాన్ని మద్రాసు హైకోర్టు రద్దు చేసినట్లు తెలిపారు. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిర్ధారించిందని న్యాయమూర్తులు వివరించారు. ఈ దశలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను కాదని తమిళనాడు ప్రభుత్వం 2016లో కొత్తచట్టాన్ని తీసుకొచ్చి రిజర్వేషన్లకు అనుగుణంగానే పదోన్నతులను కల్పిస్తోందని వారు తెలిపారు. 

ఈ కారణంగా పదోన్నతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం  అనుసరిస్తున్న విధానం చట్టవిరుద్ధంగా భావించాల్సి ఉంటుందని వారు అన్నారు. ప్రజల సంక్షేమాన్ని కాపాడే ప్రభుత్వం అందరి మంచిని మనసులో పెట్టుకోవాలని సూచించారు. పదోన్నతులు కల్పించడంలో సమభావం పాటించాలని వారు హితవుపలికారు. రిజర్వేషన్లపై పదోన్నతులు కల్పించడంలో ప్రభుత్వ నిజాయితీ న్యాయస్థానానికి కనపడలేదు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరైనవే అనేందుకు ఆధారాలు లేవు. కాబట్టి రిజర్వేషన్ల ప్రాతిపదికన పదోన్నతులు కల్పించడం చట్టవిరుద్దమేనని స్పష్టం అవుతోంది. పిటిషన్‌దారులకు పదోన్నతులకు అనుగుణమైన సీనియారిటిని లెక్కకట్టి 12 వారాల్లోగా నివేదిక ఆందజేయాలని న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ఆదేశించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement