ఎన్‌ఐఏకి కోరలు

Lok Sabha passes NIA Amendment Bill to give more power to anti-terror agency - Sakshi

మరిన్ని అధికారాలు కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఈ చట్టాన్ని మేం దుర్వినియోగం చేయం: అమిత్‌ షా

ఉగ్రవాదం అంతమే లక్ష్యమని వెల్లడి

మరోసారి ‘అద్దె గర్భం’ బిల్లు

న్యూఢిల్లీ: భారతీయులు లేదా భారత దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విదేశాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపైనా విచారణ చేపట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అధికారాలిచ్చేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. విదేశాలకు సంబంధించిన కేసుల విచారణను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు పర్యవేక్షిస్తుంది. సైబర్‌ ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ నోట్లను వ్యాప్తిచేయటం, నిషేధిత ఆయుధాల తయారీ, వాటి అమ్మకం కేసులపై విచారించేందుకు కూడా ఎన్‌ఐఏకి ఈ బిల్లు అధికారం ఇస్తోంది.

ఇలాంటి కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే అధికారం కూడా ఎన్‌ఐఏకు ఉంటుంది. 2008లో ముంబైలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించి 166 మందిని చంపేసిన అనంతరం, 2009లో ఉగ్రవాద కేసుల విచారణకు ప్రత్యేకంగా ఎన్‌ఐఏను ఏర్పాటు చేశారు. కొత్త సవాళ్లను పరిష్కరించేందుకు ఎన్‌ఐఏకు మరిన్ని అధికారాలు అవసరమని 2017 నుంచీ హోం శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ‘జాతీయ దర్యాప్తు సంస్థ (సవరణ) బిల్లు–2019’ని లోక్‌సభలో ప్రవేశపెట్టగా, అది ఆమోదం పొందింది.

ఎన్‌ఐఏ చట్టాన్ని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయదని అమిత్‌ అన్నారు. తమ ప్రభుత్వ లక్ష్యం ఉగ్రవాదాన్ని అంతం చేయడమేననీ, దీనికి మతంతో సంబంధం లేదనీ, ఉగ్రవాదులు ఏ మతంలో ఉన్నా తాము వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు. ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు పంపేలా పార్లమెంటు అంతా ఈ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని అమిత్‌ షా కోరారు. హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదనీ, ఇప్పుడు వారి తప్పులను తాము సరిచేస్తున్నామని అన్నారు. బిల్లుకు 278 మంది సభ్యులు మద్దతు తెలపగా, ఆరుగురు మాత్రమే వ్యతిరేకించారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ సత్యపాల్‌ సింగ్‌ మాట్లాడుతూ ఓ కేసు విచారణ సందర్భంగా ఓ రాజకీయ నాయకుడు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను గతంలో బెదిరించాడని అన్నారు

. ఆ మాటకు హైదరాబాద్‌ ఎంపీ ఒవైసీ అభ్యంతరం తెలుపుతూ ఆయన చెప్పిన దానికి ఆధారాలు చూపాలని కోరారు. దీంతో అమిత్‌ షా కలగజేసుకుంటూ ప్రతిపక్షం వాళ్లు మాట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ వాళ్లు అడ్డు తగలడం లేదనీ, అలాగే అధికార పార్టీ వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షం వాళ్లు కూడా ప్రశాంతంగా ఉండాలని ఒవైసీని ఉద్దేశించి అన్నారు. దీనికి ఒవైసీ స్పందిస్తూ, తనవైపు వేలు చూపించవద్దని అమిత్‌ షాకు చెప్పారు. తననెవరూ భయపెట్టలేరని ఆయన పేర్కొన్నారు. దీనికి అమిత్‌ షా స్పందిస్తూ తానెవరినీ భయపెట్టడానికి ప్రయత్నించడం లేదనీ, ఒవైసీ మనసులో భయం ఉంటే తానేమీ చేయలేనని అన్నారు. ఈ మాటల అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది.

లోక్‌సభకు అద్దెగర్భం బిల్లు
అద్దె గర్భం (సరోగసీ) విధానాన్ని వ్యాపారంగా వాడుకోకుండా చూసేందుకు పలు నిబంధనలతో కూడిన ‘అద్దె గర్భం (నియంత్రణ) బిల్లు–2019’ని కూడా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కూడా గతేడాది డిసెంబర్‌లోనే లోక్‌సభ ఆమోదించినప్పటికీ పార్లమెంటు దీనికి పచ్చజెండా ఊపకపోవడంతో గడువు చెల్లింది. దీంతో ఈ బిల్లును మళ్లీ కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం కనీసం ఐదేళ్ల క్రితం పెళ్లి అయ్యి, ఇంకా పిల్లలు పుట్టని దంపతులకు మాత్రమే అద్దె గర్భం ద్వారా బిడ్డను కనే అవకాశం కల్పిస్తారు. అలా పుట్టిన బిడ్డను వారు మళ్లీ ఏ కారణం చేతనైనా వదిలేయకూడదు.

దంపతుల్లో భార్య వయసు 23 నుంచి 50 ఏళ్ల మధ్య, భర్త వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఒక మహిళ తన జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి దంపతులకు తన గర్భాన్ని అద్దెకివ్వవచ్చు. ఆమె కచ్చితంగా పిల్లలు లేని దంపతులకు దగ్గరి బంధువై ఉండాలి. ఆమెకు అప్పటికే పెళ్లి అయ్యి, పిల్లలు ఉండాలి. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇప్పటివరకు అద్దెగర్భం విధానానికి సంబంధించి ఇండియాలో చట్టం ఏదీ లేదు. దీంతో విదేశీయులు ఇక్కడకు వచ్చి, మన దేశంలోని మహిళల ద్వారా ఈ విధానంలో బిడ్డలను కంటూ ఆ మహిళకు సరైన పరిహారం ఇవ్వడం లేదు. అలాంటి మహిళలు ఇకపై దోపిడీకి గురవకుండా ఉండటం కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top