జాతీయ హోదా ఇవ్వండి

KCR Meet Narendra Modi And Discuss Various State Issues - Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధానికి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి

విభజన హామీలతోపాటు 16 విన్నపాలు

రెండోసారి సీఎం అయ్యాక తొలిసారి పీఎంతో భేటీ

కేసీఆర్‌ను అభినందించిన మోదీ

హోం మంత్రి రాజ్‌నాథ్‌తోనూ భేటీ..

హైకోర్టును విభజించినందుకు కృతజ్ఞతలు

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ జీవనరేఖ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి.. సీఎం కేసీఆర్‌ విన్నవించారు. బుధవారం ఢిల్లీలో ప్రధానిని కలిసిన కేసీఆర్‌.. రాష్ట్రానికి అవసరమైన 16 అంశాలతో కూడిన అభ్యర్థనల చిట్టాను ఆయనకు అందజేశారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందే ఆయా అభ్యర్థనలను పరిష్కరించి నిధులు విడుదల చేయాలని కోరారు. రెండోసారి సీఎం అయ్యాక.. తొలిసారి ఆయన ప్రధానిని కలిశారు. లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధాని అధికారిక నివాసంలో బుధవారం సాయంత్రం 4 నుంచి ఐదు వరకు ఈ సమావేశం జరిగింది.

ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడంపై కేసీఆర్‌ను ప్రధాని అభినందించారు. దేశం అన్నదాతకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని.. ఈ దిశగా తాము రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నామని కేసీఆర్‌ వివరించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక తెలంగాణలో ఏర్పాటు కావాల్సిన జాతీయస్థాయి విద్యా సంస్థలు, మౌలిక సౌకర్యాల స్థాపనకు సంబం« దించి గతంలో వివిధ సందర్భాల్లో చేసిన అభ్యర్థనలను మరోసారి ప్రధానికి కేసీఆర్‌ వివరించారు.

 
 కేసీఆర్‌ విన్నపాలు ఇవే
1. తెలంగాణ నూతన సచివాలయ భవన నిర్మాణానికి, సమీపంలోని రాజీవ్‌ రహదారి, ఇతర రహదారుల విస్తరణకు వీలుగా బైసన్‌ పోలో, జింఖానా మైదానాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. దీనిపై రక్షణ శాఖ ఇప్పటికే సూత్రప్రాయ అంగీకారం తెలిపినా బదిలీ జరగలేదు. 
2. కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ ఏర్పాటు. 
3. హైదరాబాద్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) ఏర్పాటు. 
4. తెలంగాణలోని 21 కొత్త జిల్లాలకు జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలు ఏర్పాటు.  
5. హైదరాబాద్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌) ఏర్పాటు. 
6. కేంద్ర ఉపరితల రవాణా శాఖ ప్రతిపాదించిన మేరకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)తో కలిసి సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆదిలాబాద్‌లోని సీసీఐ ప్లాంటును పునరుద్ధరించాలి. 
7. జహీరాబాద్‌లోని నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫ్యాక్ఛరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌)కు నిధులు విడుదల చేయాలి. 
8. వరంగల్లులో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధికి వీలుగా రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలి. 
9. కృష్ణానది పరివాహక ప్రాంత రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఉండేవని, కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో కృష్ణానది జలాల పంపిణీని నాలుగు రాష్ట్రాల మధ్య తిరిగి చేపట్టాలని, ఇందుకు కొత్తగా ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ అంతర్రాష్ట నదీ జలాల వివాద చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూ)–1956లోని సెక్షన్‌–3 కింద తెలంగాణ రాష్ట్రం 2014 జూలై 7న కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేసిన సంగతిని సీఎం గుర్తుచేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేంద్ర జల వనరుల శాఖ ఈ చట్టంలోని సెక్షన్‌ 5(1) ద్వారా సంక్రమించిన అధికారాలతో ఈ ఫిర్యాదుపై విచారణకు కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడం గానీ, ఉనికిలో ఉన్న ట్రిబ్యునల్‌ను విచారించమనడం కానీ చేయాలని వివరించారు. కానీ ఈ ఫిర్యాదును కేంద్రం పట్టించుకోకుండా కేవలం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 89 అమలు కోసం మాత్రమే బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ గడువును పొడిగించిందని వివరించారు. సెక్షన్‌ 89 పరిధి చాలా పరిమితమని, ఇది తెలంగాణ హక్కులను కాపాడడంలో న్యాయం చేయదని నివేదించారు. అందువల్ల తెలంగాణ ఇచ్చిన ఫిర్యాదును కేంద్రం పునఃపరిశీలించి అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టంలోని సెక్షన్‌ 5(1) కింద కేడబ్ల్యూడీటీ–2కి రెఫర్‌ చేయాలని కోరారు.  
10. తెలంగాణకు జీవనరేఖగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని కేసీఆర్‌ కోరారు. ఈ భారీ నీటి పారుదల ప్రాజెక్టుకు ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని కోరారు. ఏడు పాత జిల్లాలకు తాగు, సాగు నీరు, జంట నగరాలకు తాగు నీరు అందించనున్న ఈ భారీ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం ద్వారా తెలంగాణకు సాయపడాలని కోరారు. 
11. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, షెడ్యూలు 10 సంస్థల విభజనకు పరిష్కారం చూపాలి.  
12. త్వరితగతిన నిధులు విడుదల చేస్తూ రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయాలి. 
13. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సత్వరం పరిష్కరించాలి.  
14. విభజన చట్టాన్ని అనుసరించి వరంగల్లు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలి. 
15. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి తెలంగాణలోని వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.450 కోట్లను విడుదల చేయాలి. 
16. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన పథకం కింద రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. 
 


హోం మంత్రితో సమావేశం 
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోనూ కేసీఆర్‌ సమావేశమయ్యారు. సాయంత్రం 5.45 గంటలకు జరిగిన ఈ భేటీలో ఎంపీ వినోద్‌కుమార్, తెలంగాణ ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్‌ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి హైకోర్టు విభజనకు చర్యలు తీసుకున్నందుకు హోం మంత్రికి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, షెడ్యూలు 10 సంస్థల విభజనకు సంబంధించి పెండింగ్‌ అంశాలను పరిష్కరించాలని కోరారు. విభజన చట్టానికి సంబంధించి ఇతర పెండింగ్‌ అంశాలనూ సీఎం ప్రస్తావించినట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. 
 
కేసీఆర్‌ను హైదరాబాద్‌లో కలుస్తా: అఖిలేష్‌ యాదవ్‌ 
దేశంలోని విభిన్న పార్టీలను ఫెడరల్‌ ఫ్రంట్‌ కిందికి తెచ్చేందుకు కేసీఆర్‌ కృషిచేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ అభినందించారు. బుధవారం ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడుతూ ‘అన్ని పార్టీలను ఏకతాటిపైకి తేవడం కొన్ని నెలలుగా సాగుతోంది. కేసీఆర్‌ ఈ దిశగా ప్రయత్నిస్తున్నందుకు అభినందనలు. ఫెడరల్‌ ఫ్రంట్‌గా పార్టీలన్నీ కలిసేందుకు ఆయన కృషిచేస్తున్నారు. ఢిల్లీలో 25, 26 తేదీల్లో కేసీఆర్‌ను కలవాల్సి ఉంది. కానీ నేను ఢిల్లీ వెళ్లలేకపోయాను. జనవరి 6 తరువాత హైదరాబాద్‌ వెళ్లి కలుస్తాను’అని అఖిలేష్‌ యాదవ్‌ చెప్పినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. కాగా కేసీఆర్‌ గురువారం వీలును బట్టి బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసే అవకాశం ఉంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top