‘అదృశ్యాల’పై అలుపెరగని పోరు.. | Kashmir Iron Lady Parveena Ahanger On BBC List Of 100 Most Inspiring Women | Sakshi
Sakshi News home page

బీబీసీ జాబితాలో 'ఐరన్‌ లేడీ ఆఫ్‌ కశ్మీర్‌'

Oct 22 2019 7:23 PM | Updated on Oct 24 2019 2:59 PM

Kashmir Iron Lady Parveena Ahanger On BBC List Of 100 Most Inspiring Women - Sakshi

న్యూఢిల్లీ : పర్వీనా అహంగర్‌.. జమ్మూ కశ్మీర్‌లో ఈ పేరు తెలియని వారుండరు.1990లో భారత సైన్యం తన కుమారుడిని అదృశ్యం చేసిందన్న ఆరోపణలపై 29 ఏళ్లుగా పోరాటం చేస్తూ 'ఐరన్ లేడీ ఆఫ్ కాశ్మీర్'గా ప్రసిద్ది చెందిన మహిళ ఆమె. అలుపెరగని పోరాటంతో బీబీసీ స్పూర్తిదాయక మహిళల జాబితా టాప్‌ 100 జాబితాలో ఈ ధీర వనిత చోటు సంపాదించారు. పర్వీనా అహంగర్‌ 1994లో అసోసియేషన్ ఆఫ్ పేరెంట్స్‌ ఆఫ్‌ డిసప్పియర్డ్‌ పేరెంట్స్‌ (ఏపీడీపీ)ని ఏర్పాటు చేసి కశ్మీర్‌ లోయలో ‘అదృశ్యాల’పై గళమెత్తారు. 50 ఏళ్ల పర్వీనా 25 ఏళ్లుగా పోరాడుతూ ఏపీడీపీని ముందుండి నడిపిస్తున్నారు. ఆమె పోరాటానికి ఐక్యరాజ్యసమితి  కూడా అండగా నిలిచింది. పర్వీనా ఉద్యమ స్ఫూర్తికి  ఎన్నో పురస్కారాలు వరించాయి. 2015లో నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్‌ అయ్యారు. మానవ హక్కుల పరిరక్షణకు చేస్తున్న కృషికి గానూ పర్వీనాను 2017లో నార్వే దేశం ప్రఖ్యాత రాఫ్టో ప్రైజ్‌తో  సత్కరించింది. 

తాను పోరాటానికి దారి తీసిన పరిస్థితుల గురించి గతంలో యూకే వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో పర్వీనా అహంగర్‌ వివరించారు. 'నా కుమారుడు 11వ తరగతి చదివేటప్పుడు అదృశ్యమయ్యాడు. వాడు కనిపించకుండా పోయాడని తెలుసుకొన్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా కుమారుడిని జాగ్రత్తగా తీసుకొస్తామని వారు హామీ ఇచ్చారు. తొమ్మిది రోజులు వారిచుట్టూ తిరిగినా ఏ సమాచారం అందించలేదు. ఇక లాభం లేదనుకొని పోరాటం మొదలు పెట్టాను. కనిపించకుండాపోయిన కొడుకు కోసం 27 సంవత్సరాలుగా ఆశగా ఎదురుచూస్తున్నట్లు' కన్నీటి పర్యంతమయ్యారు. 

1991లో తన కొడుకు జాడను తెలపాలంటూ జమ్మూకశ్మీర్‌ హైకోర్టులో సైన్యానికి వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేశానని తెలిపారు. తాను వేసిన కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇదే సమయంలోనే నా కుమారుడి ఆచూకీ కోసం పలుమార్లు ఆర్మీ శిబిరాలను సందర్శించాను. తన లాంటి పరిస్థితే అక్కడ చాలా కుటుంబాలు ఎదుర్కొంటున్నాయని తెలుసుకున్నాను. అప్పుడే నాకు ఒక ఆలోచన తట్టింది. నాలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న కుటుంబాలను కలిసి వారు మద్దతు కూడగట్టాలని నిర్ణయించుకున్నాను. మొత్తం 50 కుటుంబాలు నాకు మద్దతుగా నిలవడంతో 1994లో ఏపీడీపీని స్థాపించి దాని ద్వారా ఆర్మీకి వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్‌ హైకోర్టులో సిట్‌ దాఖలు చేశాన’ని వివరించారు. అప్పటి నుంచి పర్వీనా ఆమె అనుచరులతో కలిసి చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. పాలకులు ఎన్నిసార్లు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమె వెనుకడుగు వేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement