వైరలవుతున్న అనకొండ గుడ్లు...?

Kashmir Fears About Anaconda Eggs - Sakshi

కశ్మీర్‌ : గత కొన్ని రోజులుగా కశ్మీర్‌లో ‘అనకొండ గుడ్లు’ అనే వార్త తెగ హల్‌చల్‌ చేస్తోంది. అవును ‘అనకొండ గుడ్ల’ గురించే కశ్మీర్‌ ప్రజలు ఇప్పుడు తెగ చర్చించుకుంటున్నారు. వివరాల ప్రకారం కొన్ని రోజుల క్రితం కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఒక అనుమానాస్పద బ్యాగ్‌ వెలుగు చూసింది. ఆ బ్యాగ్‌ మీద ‘అనకొండ గుడ్లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ రిసెర్చ్‌, బ్రెజిల్‌’ అని రాసి ఉంది. అంతే కాక ‘జాగ్రత్తగా తెరవండి...చల్లని ప్రదేశంలోనే ఉంచండి, లేదంటే గుడ్లు పొదిగే ప్రమాదం ఉంది’ అని రాసి ఉంది. ఈ బ్యాగ్‌ కనిపించడంతో  ఇన్ని రోజులుగా పుల్వామా ప్రజలను వేధిస్తున్న ఒక ప్రశ్నకు సమాధానం కూడా దొరికినట్లయ్యింది.

అదేంటంటే ఎన్నడు లేనిది కొన్నాళ్లుగా పుల్వామా జిల్లాలోని పొలాల్లో పాముల సంచారం పెరిగినట్లు స్థానికులు గుర్తించారు. దాంతో ఈ అనకొండ గుడ్లు పొదగడం వల్లే పాముల సంఖ్య పెరుగుతుందనే నిర్ణయానికి వచ్చారు స్థానికులు. అయితే కశ్మీర్‌ వైల్డ్‌ లైఫ్‌ డిపార్టమెంట్‌ అధికారులు మాత్రం ‘మాకు ఈ ప్రాంతంలో ఇంతవరకూ ఒక్క పాము కూడా కనిపించలేదు’ అని తెలిపారు.

అంతేకాక ‘పాములు కనిపించడం అనేది కొత్త విషయం ఏమి కాదు. పాములనేవి ఎప్పుడైనా, ఎక్కడైనా కన్పిస్తాయి. కానీ అనకొండ గుడ్ల వల్లనే పాముల సంఖ్య పెరిగిందనడం కాస్తా ఆశ్చర్యం కలిగించే అంశమే కాక అవాస్తవం కూడా. ఎందుకంటే అనకొండ గుడ్లు పెట్టదు. స్వయంగా పిల్లలను కంటుంది’ అని తెలిపారు అధికారులు. అంతేకాక కొండ చిలువలు కూడా భారీ సైజులో ఉండటంతో జనాలు వీటినే అనకొండలుగా భావిస్తున్నారని తెలిపారు.

ఇంతా జరిగినప్పటికి ఆ బ్యాగ్‌ ఎక్కడి నుంచి వచ్చింది, దానిలో ఉన్నవి ఏంటి అనే విషయం  ఇంతవరకూ తెలియరాలేదు. ఈ విషయం గురించి నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ పోస్టు చేస్తున్నారు. ‘38 డిగ్రిల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో అనకొండలు బతకలేవు...చనిపోతాయి. అంతేకాక అనకొండలు ఎక్కువగా నీటిలోనే ఉంటాయి. కశ్మీర్‌ నదులు ఎప్పుడు గడ్డకట్టే ఉంటాయి కాబట్టి అక్కడ అనకొండలు బతికే అవకాశమే లేదు’ అని కామెంట్‌ చేయగా మరి కొందరు ‘అనకొండలు గుడ్లు పెట్టవు...ఒకవేళ పెట్టినా అవి పొదగాలంటే చాలా అధిక ఉష్ణోగ్రతలు కావాలి. కాబట్టి కశ్మీర్‌లాంటి ప్రాంతంలో ఆ గుడ్లు పొదిగే అవకాశమే లేదు’ అని పోస్టు చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top