లాకులెత్తారు! | Sakshi
Sakshi News home page

లాకులెత్తారు!

Published Tue, Jun 9 2020 5:12 AM

India reopens after lockdown lifted - Sakshi

న్యూఢిల్లీ: రెండు నెలలకు పైగా కొనసాగుతున్న ‘లాక్‌డౌన్‌’ నుంచి వ్యూహాత్మక ‘అన్‌లాక్‌’ దిశగా దేశం మరో అడుగు వేసింది. మార్చి 25 తరువాత తొలిసారి దేశవ్యాప్తంగా సోమవారం పలు ప్రాంతాల్లో ప్రార్థనాలయాలు, షాపింగ్‌ మాల్స్, రెస్టారెంట్లు, కార్యాలయాలు తెరుచుకున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ప్రకటించిన కఠిన నిబంధనల మధ్య ఆయా ప్రదేశాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రార్థనాలయాలు, మాల్స్‌లో ప్రవేశానికి సంబంధించి.. పరిమిత సంఖ్యలో వ్యక్తులను లోనికి అనుమతించడం, భౌతిక దూరం, థర్మల్‌ స్క్రీనింగ్, మాస్క్‌ తప్పనిసరి చేయడం, ఆ ప్రదేశమంతా ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయడం, ప్రవేశ ప్రాంతాలు సహా ఇతర ముఖ్య ప్రదేశాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచడం.. తదితర నిబంధనలను పాటించారు.

  అయోధ్యలోని రామజన్మభూమి, ఉడిపిలోని మూకాంబికా దేవాలయం, ఢిల్లీలోని జామామసీదు, అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం మొదలైనవి తెరుచుకున్నాయి.  షాపింగ్‌ మాల్స్‌కి ఊహించిన స్థాయిలో వినియోగదారులు రాలేదు. కరోనా భయం, లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు అందుకు కారణంగా భావిస్తున్నారు. రెస్టారెంట్లలోనూ అరకొరగానే ఆహార ప్రియులు కనిపించారు. వెయిటర్లు ఫేస్‌ షీల్డ్‌లు ధరించి సర్వీస్‌ చేశారు. టేబుళ్లను దూరం దూరంగా ఏర్పాటు చేశారు. రెస్టారెంట్లలో డిజిటల్‌ మెన్యూస్, డిజిటల్‌ పేమెంట్స్‌కు ప్రాధాన్యమిచ్చారు. కాగా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాల్లో ప్రార్థనాలయాలు, మాల్స్‌ను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు.
 

Advertisement
Advertisement