పెను తుపానుగా ఓక్కి

Heavy rain lashes South Tamil Nadu, Kerala; toll mounts to 16 - Sakshi

తమిళనాడు, కేరళల్లో 16 మంది మృతి

లక్షద్వీప్‌ సమీపంలో కేంద్రీకృతం.. తమిళనాడుకు మరో తుపాను!

సాక్షి ప్రతినిధి, చెన్నై: పెను తుపానుగా మారిన ఓక్కి సృష్టించిన విధ్వంసానికి తమిళనాడు, కేరళలు విలవిలలాడాయి. ఓక్కి తుపాను ప్రభావం దక్షిణ తమిళనాడు, కేరళ తీర ప్రాంతాలపై శుక్రవారం కూడా కొనసాగింది. దీంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 16 మంది మృత్యువాత పడ్డారు. కన్యాకుమారి జిల్లా దారుణంగా దెబ్బతింది.

అలాగే తిరునల్వేలి, తూత్తుకూడి, పుదుకోట్టై, రామనాథపురం, విరుదునగర్‌ జిల్లాలు  నష్టపోయాయి. ప్రస్తుతం తుపాను లక్షద్వీప్‌లోని మినికాయ్‌కు 80 కి.మి. ఉత్తర ఈశాన్య దిశలో కేంద్రీకృతమైంది. మరోవైపు, దక్షిణ అండమాన్‌ సముద్రం సమీపంలో కేంద్రీకృతమైన వాయుగుండం తుపానుగా బలపడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.  

కన్యాకుమారి అతలాకుతలం
ఓక్కి తుపాను దెబ్బకు తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా ఎక్కువగా నష్టపోయింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పాటు పలు ప్రాంతాల్ని వరదలు ముంచెత్తాయి. సుమారు 3,500 విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో శుక్రవారం కూడా కరెంటు లేదు. రెండువేలకు పైగా చెరువులు పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయి. కన్యాకుమారీ –నాగర్‌కోవిల్, నాగర్‌కోవిల్‌–తిరునెల్వేలి జాతీయరహదారుల్లో వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు. నాగర్‌కోవిల్‌ నుంచి కన్యాకుమారి, తిరువనంతరపురం మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

సెంగోట్టై సమీపంలో ఒక ప్రభుత్వ బస్సు వరద ప్రవాహంలో చిక్కుకోగా, అత్యవసర ద్వారాన్ని తెరిచి ప్రయాణికుల్ని ç బయటకు తీసుకొచ్చారు.  కావేరీ డెల్టాలో ఆరురోజులుగా కుండపోత వర్షాలతో లక్ష ఎకరాల వరి పంట దెబ్బతింది.  తమిళనాడులో ఇంతవరకూ 9 మంది మరణించగా, మృతుల కుటుంబాలకు సీఎం రూ.4లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కేరళలో తుపాను దెబ్బకు మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top