
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(66) ఆరోగ్యం క్షీణిస్తోందంటూ వస్తున్న వార్తలు అబద్ధం, నిరాధారాలని కేంద్రం కొట్టిపారేసింది. ఇలాంటి పుకార్లకు దూరంగా ఉండాలని మీడియాను కోరింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం, తదితర కీలక పరిణామాల నేపథ్యంలో అరుణ్ జైట్లీ బయటకు కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యం గురించి వస్తున్న ఊహాగానాలను ప్రభుత్వ ప్రతినిధి సితాన్షు కర్ ట్విట్టర్‌లో ఖండించారు. ‘కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఒక వర్గం మీడియాలో వస్తున్న కథనాలు అసత్యం, నిరాధారాలు. ఇలాంటి వదంతులకు మీడియా దూరంగా ఉండాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. అయితే, జైట్లీని సంప్రదించేందుకు మీడియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన కార్యాలయం తెలిపింది.
జైట్లీ చాలా బలహీనంగా ఉన్నారని, అనారోగ్యం కారణంగానే ప్రధాని మోదీ రెండోసారి ఏర్పాటు చేయబోయే కేబినెట్‌లో ఉండే అవకాశాలు లేవని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరింత మెరుగైన వైద్యం కోసం ఆయన బ్రిటన్ లేదా అమెరికా వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. బయటకు వెల్లడించని అస్వస్థతతో గతవారం జైట్లీ ఎయిమ్స్‌లో చేరారు. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయినప్పటికీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికల విజయోత్సవాల్లో ఆయన పాల్గొనలేదు. ‘నా మిత్రుడు జైట్లీ అనారోగ్యంపై వస్తున్న వార్తలన్నీ వదంతులు. శనివారం సాయంత్రమే ఆయన్ను కలిశాను. ఆయన కోలుకుంటున్నారు. తన మంత్రిత్వ శాఖకు చెందిన ఐదుగురు కార్యదర్శులతో శుక్రవారం జైట్లీ తన నివాసంలో సమావేశం నిర్వహించారని అధికార వర్గాలు తెలిపాయి.