అత్యాచారం జరిగినా అతడు నిర్దోషేనా!!

Delhi Court Acquits Man Accused Of Molestation By Estranged Wife - Sakshi

కానీ హైకోర్టు ధర్మాసనం అప్పుడు ఏమన్నదంటే...

న్యూఢిల్లీ: ‘‘బాధితురాలు చెప్పిన ప్రకారం ఆమెకు నవంబరు 2, 2015లో అతడితో వివాహం జరిగింది. అయితే జూలై 5, 2016 తర్వాత అతడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది. అయితే ఆనాటికి వాళ్లిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం ఉంది కాబట్టి... దీనిని అత్యాచారంగా పరిగణించలేం. అందుకే అతడు నిర్దోషి’’ అని ఢిల్లీ అదనపు సెషన్స్‌ కోర్టు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని విడుదల చేసింది. అత్యాచారం జరిగే నాటికి బాధితురాలు నిందితుడి భార్యగా ఉన్నందున దానిని నేరంగా పరిగణించలేమని పేర్కొంది. వివరాలు... పంజాబ్‌కు చెందిన ఓ మహిళకు 2015లో పెళ్లి జరిగింది. అయితే తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి గతంలో దొంగతనం కేసులో దోషిగా తేలి.. జైలు శిక్ష అనుభవించాడని ఆమెకు ఆలస్యంగా తెలిసింది. దీంతో మనోవేదనకు గురైన సదరు మహిళ.. భర్తకు చెప్పకుండా ఢిల్లీకి వెళ్లి.. అక్కడే జీవించడం మొదలుపెట్టింది.

ఈ క్రమంలో కొన్నిరోజులకు ఆమె జాడను కనుక్కున్న భర్త.. తనతో కలిసి జీవించాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది. అయితే కొన్నాళ్ల తర్వాత.. తాను కష్టపడి సంపాదించుకున్న రూ. 2 లక్షలను అతడు దొంగతనం చేశాడంటూ సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. గతంలో కూడా ఇలాంటి పనులు చేశాడని.. ఎప్పటికైనా మారతాడని ఎదురుచూశానని.. కానీ అతడిలో ఎలాంటి మార్పు రాలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ అతడు భార్య దగ్గరికి తరచుగా వెళ్లేవాడు. ఈ క్రమంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. ఈ కేసును విచారించిన న్యాయస్థానం... వాళ్లిద్దరూ చాలారోజుల పాటు కలిసే ఉన్నారని.. కేవలం డబ్బు విషయంలో భేదాభిప్రాయాలు తలెత్తడంతోనే ఇప్పుడు బాధితురాలు కేసు నమోదు చేసిందని పేర్కొంది. ఆమె ఇష్టప్రకారమే అతడితో శారీరక సంబంధానికి సమ్మతించిందని తన మాటల ద్వారా అర్థమైందని.. కాబట్టి అతడిని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. 

అప్పుడు అంగీకరించినా.. కేసు పెట్టవచ్చు కదా!
కాగా ఈ కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం గతంలో పేర్కొన్న అంశాలను విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. దీనిని వైవాహిక అత్యాచారంగా పరిగణించవచ్చు కదా అని అభిప్రాయపడుతున్నారు. ‘‘వివాహం అనగానే భార్య ఎల్లవేళలా సిద్ధంగా ఉండి.. భర్తతో శారీరక సంబంధాలకు సమ్మతి తెలుపుతుందని అర్థం కాదు. భార్య సమ్మతితోనే భర్త ఈ సంబంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది’ అని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిట్టల్‌, సీ హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం గతంలో పేర్కొంది. ఈ అంశంపై విచారణ సందర్భంగా... లైంగిక హింస విషయంలో భాగస్వామిని బలవంతపెట్టడం, భయపెట్టడం వంటి చర్యలను మాత్రమే నేరంగా పరిగణించాలని, అలాంటివి లేనప్పుడు దీనిని నేరంగా పరిగణించలేమని మారిటల్‌ రేప్‌ అంశాన్ని వ్యతిరేకిస్తున్న పురుషుల సంక్షేమ ట్రస్ట్‌ అనే ఎన్జీవో సంస్థ వాదించగా.. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. లైంగిక దాడి కోసం బలవంతపెట్టారా? గాయాలయ్యాయా అని చూడాల్సి అవసరం ఇప్పుడు లేదని, రేప్‌ నిర్వచనం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని ధర్మాసనం పేర్కొంది.

‘శారీరంగా బలవంతపెట్టడమనేది కచ్చితమైన షరతు ఏమీ కాదు. భార్యను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి.. శృంగారంలో పాల్గొంటేనే గృహావసరాలు, పిల్లల ఖర్చుల కోసం డబ్బులు ఇస్తానని భర్త ఒత్తిడి చేయవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్య అందుకు ఒప్పుకున్నా.. ఆ తర్వాత ఆమె భర్తకు వ్యతిరేకంగా రేప్‌ కేసు పెట్టవచ్చు. అది జరిగే అవకాశముంది’ అని ధర్మాసనం పేర్కొంది. గృహహింస నిరోధక చట్టం, వివాహిత మహిళల వేధింపుల నిరోధక​ చట్టం, వేరుగా ఉంటున్న భార్యతో బలవంతపు శృంగారం నిరోధించే చట్టాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో భార్యతో శృంగారం నేరం కాబోదని పేర్కొంటున్న సెక్షన్‌ 375ను మార్చాల్సిన అవసరం ఏముందని మారిటల్‌ రేప్‌ను వ్యతిరేకిస్తున్న ఓ పిటిషనర్‌ వాదించగా.. ఇన్ని చట్టాల పరిధిలో ఉన్నప్పుడు సెక్షన్‌ 375లో మాత్రం ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించిన తీరును ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top