చిన్నారుల మృత్యువాతపై సుప్రీం దిగ్భ్రాంతి

Deaths of children can not go on in Bihar - Sakshi

బిహార్‌ ఘటనలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు

వారం రోజుల్లోగా సమాధానమివ్వాలని ఆదేశం  

న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడు వాపు వ్యాధి కారణంగా 150కి పైగా చిన్నారులు మృత్యువాత పడటంపై సుప్రీంకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, పోషకాహారం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత పరిస్థితులు ఎలా ఉన్నాయో చెబుతూ వారంలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని బిహార్‌ ప్రభుత్వంతోపాటు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బిహార్‌లో మెదడువాపు వ్యాధి కారణంగా పెద్ద సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడటంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, పోషకాహారం, పారిశుద్ధ్యం వంటి వాటిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. తక్షణమే ఈ సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిందిగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు బిహార్‌ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవట్లేదంటూ ఇద్దరు న్యాయవాదులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. వాదనల సందర్భంగా.. గతంలోనూ ఇలాంటి మరణాలే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్నాయని పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది మనోహర్‌ తెలపగా.. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

ఈ మరణాలకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ఇలాంటి మరణాలు ప్రతి ఏటా సంభవిస్తున్నా.. పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. బిహార్‌లో మరణించిన చిన్నారులకు రూ.10 లక్షలు పరిహారం అందజేయాలని కోరారు. చిన్నారులు మరణించిన ముజఫర్‌పూర్‌ సహా ఇతర ప్రాంతాలకు వైద్య నిపుణులతో కూడిన ప్యానల్‌ను కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న ప్రాంతాలకు 100 మొబైల్‌ ఐసీయూ యూనిట్లను పంపాలని విజ్ఞప్తి చేశారు.  దీనిపై వారంలోగా సమాధానమివ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను 10 రోజులపాటు వాయిదా వేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top