తుపానుల వలయంలో ముంబై

Cyclone Nisarga: Short History of Mumbai Storms - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మరోసారి మహారాష్ట్రలోని ముంబై నగరానికి ‘నిసర్గ’ రూపంలో తుపాను వచ్చి పడింది. సముద్ర తీరమంతా అల్లకల్లోలంగా మారింది. వంద కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు చెట్లు చేమలు కూలిపోతున్నాయి. ముంబై నగరానికి తుపానులు, అధిక వర్షాల బెడద కొత్తకాదు. తరచుగా వస్తూనే ఉంటాయి. ఎంతో కొంత నష్టాన్ని తెస్తూనే ఉంటాయి. 2005, జూలై 26వ తేదీన కురిసిన కుంభవృష్టికి 447 మంది మరణించగా, అపార నష్టం సంభవించింది. నగర ప్రజలు ఆనాటి భయోపాతాన్ని ఇప్పటికీ మరచిపోలేక పోతున్నారు.  (ముంబైని తాకిన నిసర్గ తుఫాను)

1618, మే 15న, 1742, సెప్టెంబర్‌ 11, 1887, జూన్‌ 15వ తేదీన సంభవించిన భారీ తుపానులు సృష్టించిన బీభత్సం అంతా ఇంతకాదు. అపార ప్రాణ, ఆస్తి నష్టాలను సృష్టించిన ఈ తుపానులు నగర చరిత్ర పుటల్లో నిలిచిపోయాయి. ఈ తుపానులు వచ్చినప్పుడు నగరంలో కుంభవృష్టి కురవడంతోపాటు సముద్రం అల్లకల్లోలమైంది. ఫలితంగా రాయల్‌ షిప్పులైన సోమర్‌సెట్, సాలిస్‌బరి ముఖ భాగాలు విరిగిపోయాయి. 

పలు ఇతర నౌకలు లంగర్లను తెంపేసుకొని రోడ్డ మీద వచ్చిపడ్డాయి. ప్రస్తుతం ముంబై టౌన్‌ హాలు ముందున్న గార్డెన్లలో నడుం లోతు వరకు నీళ్లు వచ్చాయి. 1740, నవంబర్‌ 9, 1762, మార్చి 7, 1799, నవంబర్, 1854లో వచ్చిన ఓ మోస్తరు తుపానుల వల్ల కూడా దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ఎంతో నష్టం జరిగింది. ఇక ఈ తుపానుల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే జే. జర్సన్‌ డా కున్హా రాసిన ‘ది ఆరిజిన్‌ ఆఫ్‌ బాంబే’  చదవాల్సిందే. (నిసర్గ అలర్ట్‌: ఏం చేయాలి.. ఏం చేయకూడదు?!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top