వలస కార్మికులను తరలించండి

 Congress Party Writes PM Modi For Ferrying Migrant Labourers - Sakshi

ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ లేఖ

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌధురి గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వలస కార్మికులను వారి సొంతూళ్ల పంపించాలని లేదా తమ కార్మికులను తీసుకెళ్లేందుకు ఆయా రాష్ట్రాలు ఏర్పాటు చేసిన కేంద్రాలకు వద్దకు వారిని తరలించాలని కోరారు. 

దిశానిర్దేశం లేని లాక్‌డౌన్‌తో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వలస కార్మికులు చిక్కుకుపోయారని.. తిండి, బట్టలు, ఉండటానికి లేక వారు అష్టకష్టాలు పడుతున్నారని లేఖలో అధిర్‌ పేర్కొన్నారు. వారికి సరైన వైద్యసహాయం కూడా అందడం లేదని వాపోయారు. ఈ నేపథ్యంలో వలస కార్మికులను వారి సొంత ఊళ్లకు తరలించాలని కోరారు. ఇందుకోసం ‘కోవిడ్‌ ప్రొటెక్షన్‌ రైళ్ల’ను వినియోగించాలని సూచించారు. వలస కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధాని మోదీ నుంచి సానుకూల స్పందన వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం పొడిగించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.  మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌ పొడిగిస్తే వలస కార్మికులు పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (హైదరాబాద్‌ నుంచి విమానాలు..)

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top