మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం : కాంగ్రెస్‌ సీఎం

Congress Party Will Always Support Centre on Foreign Matters: Chhattisgarh CM - Sakshi

రాయ్‌పూర్‌ : చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భఘేల బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ హితం దృష్ట్యా కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ మద్దతునిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల ఎంతగా విభేదించినా అది దేశ అంతర్గత విషయమన్నారు. భఘేల ఢిల్లీ వెళ్తూ స్థానిక విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ‘విదేశీ వ్యవహార విషయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వేసే ప్రతీ అడుగుకీ, రాజకీయాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్‌ పార్టీ సపోర్ట్‌ చేస్తుంది. ఇందులో వేరే మాటకు తావులేద’ని స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370డి ఆర్టికల్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ తప్పు పట్టింది. ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ సహా ఆ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఐక్యరాజ్యసమితిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు. ఈ పరిణామం అనంతరం జమ్ముకశ్మీర్‌ విషయంలో కాంగ్రెస్‌ తన వైఖరి వెల్లడించాలని బీజేపీ నిలదీయడంతో తర్వాత రాహుల్‌గాంధీ తేరుకొని పాక్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శించినా, కాంగ్రెస్‌ వైఖరిపై ప్రజలకు అనుమానం కలిగించడంలో అధికార పార్టీ సఫలీకృతమయిందనే భావన నెలకొంది. దీనిపై భఘేల స్పందిస్తూ.. ‘దేశం లోపల మేం కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలను గట్టిగా నిలదీస్తాం, ప్రశ్నలు సంధిస్తాం, సమాధానాలు రాబడ్తాం. అయితే అది దేశ అంతర్గతం. ఈ విషయాలు ఇమ్రాన్‌కు ఎందుకు? అతను తన దేశ పరిస్థితులపై దృష్టి సారిస్తే మంచిద’ని హితవు పలికారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top