కాంగ్రెస్‌ ‘సోషల్‌ మీడియా’లో ముసలం

Congress Party Social Media Wing Workers Unwilling To Continue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ ‘సోషల్‌ మీడియా టీమ్‌’లో ముసలం పుట్టింది. అందులో నుంచి ఒక్కొక్కరు జారుకుంటున్నట్లు వస్తున్న వార్తలు కాంగ్రెస్‌ పార్టీని కూడా నిరాశ పరుస్తున్నాయి. ఈ రెండు నెలల కాలంలోనే మొత్తం 40 మంది గల పార్టీ సోషల్‌ మీడియా బంధం నుంచి ఎనిమిది మంది బయటకు వచ్చినట్లు వారు ఇతర సంస్థల ఇంటర్వ్యూలకు హాజరవడం ద్వారా తెలిసింది. ఈ విషయాన్ని పార్టీ సోషల్‌ మీడియాలో కొనసాగుతున్న ఉద్యోగులు కూడా ధ్రువీకరించారు. అందరూ కూడా టీం ఇంచార్జి దురుసు, తిక్క ప్రవర్తనే ప్రధాన కారణమని చెబుతున్నారు. అక్కడ లేడీ బాస్‌కు తోటి ఉద్యోగులంటే లెక్కలేకుండా పోయిందని, ఉద్యోగులను మందలించాల్సి వచ్చినప్పుడు ఆమె పది మందిలో పరువు తీసేవారని, మాటిమాటికి ఉద్యోగం పీకేస్తానంటూ బెదిరించేవారని ఇప్పటికే బయటకు వచ్చిన ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
 
దాదాపు 250 మందితో అధికార పక్షం బీజేపీ మీడియా సవ్యంగా పనిచేస్తుండగా, కేవలం 40 మంది సభ్యులుగల కాంగ్రెస్‌ మీడియాలో కలహాలు రేగడం పట్ల ఆ పార్టీలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పుడిప్పుడే బలపడుతుందని భావిస్తున్న కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ప్రతికూలమే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకన్నా దాదాపు ఆరేళ్లు ఆలస్యంగా, 2015లో ట్విట్టర్‌ ఖాతాను తెరచిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్, ఫేస్‌బుక్, స్నాప్‌షాట్‌  తదితర సోషల్‌ మీడియాలో పార్టీ ప్రచారం కోసం 2017లో రమ్యా అలియాస్‌ దివ్యా స్పందనను తీసుకొచ్చి బాస్‌గా కూర్చోబెట్టారు.
 
ఏడు కన్నడ, ఆరు తమిళ సినిమాలతోపాటు తెలుగులో ‘అభిమణ్యు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన దివ్యా స్పందన అత్యంత పిన్న వయస్సులో ఎంపీగా రికార్డు కూడా సష్టించారు. కర్ణాటకకు చెందిన ఆమె 2012లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి కర్ణాటకలోని మాంధ్య పార్లమెంట్‌ నియోజక వర్గానికి 2013లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి సినిమాలు, కాంగ్రెస్‌ యువజన రాజకీయాలను చూస్తున్న ఆమె, 2016లో సినిమాలకు గుడ్‌బై చెప్పారు. దాంతో ఆమెను తీసుకొచ్చి 2017లో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాకు హెడ్‌ను చేశారు.
 
బాస్‌ చెప్పారు కాబట్టి తప్పలేదు
సోషల్‌ మీడియాలో ఓ ఉద్యోగిపై తోటి ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పుడు ఆ కేసును డీల్‌ చేయడంలో కూడా దివ్యా స్పందన విఫలమయ్యారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఉద్యోగులు తెలిపారు. ఈ కేసులో సంస్థ అంతర్గత కమిటీ విచారణను పూర్తి చేయక ముందే నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారని, నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాక అతను అలాంటి వాడు కాదంటూ 29 మంది ఉద్యోగుల నుంచి సంతకాలు తీసుకొని దివ్యా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ప్రచారం నడిపారని వారంటున్నారు. లైంగిక ఆరోపణలు నిజమా, కాదా ? అన్నది తమకు తెలియదని, బాస్‌ చెప్పారు కనుక సదరు ఉద్యోగి మంచివాడేనంటూ తాము సంతకాలు చేయాల్సి వచ్చిందని వారు చెప్పారు.
 
ఏమీ చెప్పరు..
లేడీ బాస్‌ ప్రవర్తనే కాకుండా పార్టీ తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు కూడా తమకు నచ్చడం లేదని, పార్టీలో భాగంగా చూడాల్సిన సంస్థను పోటీ సంస్థగా చూస్తున్నారని కొంత మంది ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ కమ్యూనికేషన్ల విభాగం తమకు ఏ మాత్రం సహకరించడం లేదని, విలేకరుల సమావేశం ఉన్నా చివరి నిమిషం దాకా తమకు చెప్పరని వారన్నారు. అవసరమైనప్పుడు పార్టీ ‘వైఫై’ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడానికి కూడా  పార్టీ నాయకులు అనుమతించరని వారు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ సోషల్‌ మీడియాలో ఇలాంటి పరిస్థితులు కొనసాగడం తమకు బాధాకరమేనని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని వారు వ్యాఖ్యానించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top