ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోండి : సీఎం జగన్‌

CM Jagan Request PM Modi To Help Andhra Pradesh Development - Sakshi

ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి జగన్‌ భేటీ

రాష్ట్రాభివృద్ధికి సాయమందించాలని వినతి

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. పార్లమెంటు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుమారు 45 నిముషాల పాటు కొనసాగింది. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని సీఎం జగన్‌ ప్రధానిని కోరారు. రాష్ట్రాభివృద్ధికి ఆర్థికి సాయం చేయాల్సిందిగా విన్నవించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం చేసిన, చేయబోతున్న కార్యక్రమాలు... కేంద్రం అందించాల్సిన సహాయసహకారాలపై సీఎం జగన్‌ ప్రధానమంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలు ఉన్నారు.

వినతిపత్రంలో ముఖ్యాంశాలు 
‘ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. సామాజిక భద్రత కల్పించేలా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్దిపై ప్రత్యేక దృష్టిపెట్టాం. పాదర్శకత, అవినీతి రహిత పాలనకోసం ప్రభుత్వంలో అనేక సంస్కరణలు చేపట్టాం. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా నవరత్నాలు తెచ్చాం. గడచిన ఐదేళ్లుగా రాష్ట్రంలోని విద్యుత్‌ రంగంలో అస్తవ్యస్త విధానాలు అనుసరించారు. అధిక ధరలకు సంప్రదాయేతర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలనుంచి.. ముఖ్యంగా పవన విద్యుత్‌ కంపెనీల నుంచి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సంప్రదాయేతర విద్యుత్‌ కొనుగోలు పరిమితి 5–10శాతం ఉంటే, ఆ పరిమితిని దాటి 23.6 శాతం వరకూ కొనుగోలు చేశారు. 

దీనివల్ల ఏటా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రూ. 2,654 కోట్లు నష్టం వాటిల్లింది. రోజూ రూ. 7 కోట్లు డిస్కంలు నష్టపోతున్నాయి. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీలో భాగంగా సంప్రదాయేతర విద్యుత్‌ను తప్పక ప్రోత్సహించాల్సి ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనికోసం ఉద్దేశపూర్వకంగా గ్రిడ్‌ స్టెబిలిటీని కూడా పణంగా పెట్టారు. గత ఐదేళ్లలో అనుసరించిన అస్తవ్యస్త విధానాల వల్ల రూ.20వేల కోట్ల రూపాయల మేర ఉత్పత్తిదారులకు బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు విద్యుత్‌ వినియోగదారులపై భారం మోపే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే ఛార్జీలు హెచ్చుస్థాయిలో ఉన్నాయి.

విభజన కారణంగా రాష్ట్ర ఆదాయాలకు గండిపడింది. 2014–15 నాటికి రూ. 97వేల కోట్లు ఉన్న అప్పులు 2018–19 నాటికి రూ. 2.58 లక్షల కోట్లకు చేరాయి. వెనుకబడిన 7 జిల్లాలకు ఆరేళ్ల కాలానికి యాభై కోట్ల చొప్పున ఇప్పటికి రూ. 2100 కోట్లు అందాల్సి ఉండగా, రూ.1050 కోట్లు మాత్రమే విడుదలచేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికోసం కేబీకే తరహాలో మిగిలిన రూ.23,300 కోట్ల నిధులు ఇవ్వండి. పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్రలో చెరువుల అనుసంధానం  కార్యక్రమానికి సాయం చేయండి. గోదావరి, కృష్ణా అనుసంధానం ద్వారా కృష్ణా డెల్టాకే కాకుండా కరవు పీడిత రాయలసీమ ప్రాంతానికి జలాలు అందించి తాగునీరు, సాగునీటి కొరతను నివారించడానికి పూనుకున్నాం. దీనికీ సాయం చేయండి. 

కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గిపోయింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గోదావరిలో వరదజలాలను తరలించాల్సిన ఆవశ్యకత నెలకొంది. గోదావరి–కృష్ణా అనుసంధానానికి సాయం చేయండి. రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇది పరస్పర ప్రయోజనకరం. ఇంటింటికీ రక్షిత తాగునీటి కల్పించడానికి వాటర్‌ గ్రిడ్‌ను తీసుకొస్తున్నాం. 2050 వరకూ ప్రజల అవసరాలను తీర్చిదిద్దేలా గ్రిడ్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దాదాపు రూ.60వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. దీనికి తగురీతిలో సాయమందించండి.

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వబోతున్నాం. సెక్‌ డేటా సరిగ్గా లేకపోవడంవల్ల రాష్ట్రం నష్టపోతోంది. ఈ డేటా వల్ల కేవలం 10.87లక్షల మంది లబ్ధిదారులను మాత్రమే కేంద్రం ఎంపిక చేసింది. సెక్‌ డేటాను సరిచేసి అర్హులైన వారందరినీ ఎంపికచేయాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరం. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రాయితీలు ఇవ్వండి. పదేళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇవ్వండి. పదేళ్ల పాటు ఇన్‌కంట్యాక్స్‌ మినహాయింపులు ఇవ్వండి.10 ఏళ్లపాటు 100శాతం ఇన్సూరెన్స్‌ ప్రీమియం రియంబర్స్‌మెంట్‌ ఇవ్వండి. రెవెన్యూ లోటు రూపేణా రూ.22,948 కోట్లను పూడ్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుకోసం గతంలో ఖర్చుచేసిన రూ. 5,103 కోట్లను రీయంబర్స్‌ చేయండి.

ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, పునరావాసం కోసం రూ.16వేల కోట్లు మంజూరు చేయండి. కడప స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామంటూ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారు. ఇది ఈ ప్రాంతానికి చాలా అవసరం. ఇనుప గనులు, నీటి వసతి లభ్యత ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేశాం. దీనికి పోర్టు, రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావాలి. దుగ్గరాజపట్నం వద్ద పోర్టును ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చారు. దుగ్గరాజ పట్నం పోర్టు ఏర్పాటు సాధ్యంకాదని, ప్రత్యామ్నాయ స్థలం చూడాలంటూ నీతి ఆయోగ్‌ చెప్పింది. దీనికి బదులుగా రామాయపట్నం వద్ద పోర్టును నిర్మించండి. రాజధాని నిర్మాణంకోసం రూ. 2500 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇప్పటికి రూ.1500 కోట్లు ఇచ్చారు. రాజధాని నిర్మాణం పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నాం. విచారణ పూర్తయ్యాక శాస్త్రీయ దృక్పథంతో రాజధాని నిర్మాణానికి కావాల్సినవి కోరుతాం’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top