కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న నిర్ణయం

CEC Key Decision On EVM Buttons Amid Coronavirus - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్‌​ సమయంలో వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే 65 ఏళ్ల పైబడిన వాళ్లతో పాటు కోవిడ్‌ బాధితులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించిన ఈసీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయించింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఈ ప్రయోగాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ మధ్య ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలింగ్ సందర్భంగా కరోనా వ్యాప్తి చెందకుండా ఈసీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. (కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం)

పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే వారికి ఖాదీ మాస్కులతో పాటు శాటిటైజర్‌ కూడా చేయనుంది. ఓటింగ్‌ కేంద్రాల్లో ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండేందుకు అదనంగా 45 శాతం పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయనుంది. అలాగే ఒక్కో పోలింగ్ కేంద్రంలో వెయ్యి మంది ఓటర్లకు మాత్రమే అవకాశం కల్పించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అధికారులు పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేయనున్నారు. మరోవైపు ప్రాణాంతక కరోనా వైరస్‌ ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించకపోవడంతో జాగ్రత్తలు పాటిస్తూనే ఎన్నికల నిర్వహించాలని ఈసీ భావిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top