‘జీఎస్టీలోకి పెట్రోలు’ సాధ్యం కాదు

Bringing petrol and diesel under GST impractical: NITI Aayog Vice Chairman - Sakshi

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌

న్యూఢిల్లీ : లాభాల పంట పండిస్తున్న పెట్రోల్, డీజిల్‌పై పన్నుల్ని తగ్గించే ఆలోచన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు  ఇప్పట్లో లేనట్లే కన్పిస్తోంది. నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలంటూ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. ‘పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ కిందకు తీసుకురావడం కష్టసాధ్యం. ఎందుకంటే ప్రస్తుతం వాటిపై రాష్ట్ర, కేంద్ర పన్నుల మొత్తం 90 శాతంగా ఉంది. జీఎస్టీలో అత్యధిక పన్ను రేటు 28 శాతమే. అలాంటప్పుడు అంత ఆదాయాన్ని రాష్ట్రాలు వదులుకుంటాయని నేను అనుకోను’ అని చెప్పారు.

పెట్రోల్, డీజిల్‌ కోసం జీఎస్టీలో కొత్త పన్ను రేటు అమల్లోకి తేవాల్సి ఉంటుందని, అది చాలా ప్రయాసతో కూడుకున్న ప్రయత్నమని కుమార్‌ పేర్కొన్నారు. ‘ఒకవేళ పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీలోకి తేవాలంటే .. వాటిపై పన్నులు తగ్గించడం మొదలుపెట్టాలి. రాష్ట్రాలు వ్యాట్‌ విధించడం వల్ల ధరలు పెరిగినప్పుడు పెట్రో రేట్లు భారీ గా పెరుగుతున్నాయి. అందువల్ల పన్ను రేటు సహేతుకంగా ఉండేలా చూడాలి. ముఖ్యంగా రాష్ట్రాలు పన్నులు తగ్గించాలి’ అని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో పన్నుల రాబడిపై ఆధారపడడం క్రమంగా తగ్గించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం ఆయిల్‌ ఉత్పత్తులపై ఏడాదికి కేంద్రం రూ. 2.5 లక్షల కోట్లు, రాష్ట్రాలు రూ. 2 లక్షల కోట్లు పన్నుల రూపంలో వసూలు చేస్తున్నాయని, క్రమంగా పన్నులు తగ్గిస్తే.. కొంతకాలానికి ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని తెలిపారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top