వర్దా గర్జనకు వణికిన చెన్నై | Bellowed Verde trembled Chennai | Sakshi
Sakshi News home page

వర్దా గర్జనకు వణికిన చెన్నై

Dec 13 2016 2:42 AM | Updated on Oct 30 2018 6:08 PM

వర్దా గర్జనకు వణికిన చెన్నై - Sakshi

వర్దా గర్జనకు వణికిన చెన్నై

పెను తుపాను వర్దా తమిళనాడును కకావికలం చేసింది. గంటకు 100 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులతో చెన్నైతోపాటు తమిళనాడు తీరప్రాంతం అతలాకుతలమైంది.

తీరం దాటిన పెనుతుపాను

తమిళనాడులో భారీ వర్షాలు
గంటకు 129 కిలోమీటర్ల వేగంతో గాలులు


- రహదారుల్లో గాలికి తిరగబడిన కార్లు
- ఎగిరిపోయిన పూరిళ్ల పైకప్పులు
- ఎప్పుడేమవుతుందోనని భయం భయంగా జనం
- గత ఏడాది బీభత్సం మరవకముందే మళ్లీ ముప్పు
- వణికిపోయిన ఐదు జిల్లాలు.. జనం కకావికలం
- ముగ్గురు మృతి.. రూ. 4 లక్షల పరిహారం
విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

చెన్నై ప్రజలు సోమవారం నిమిషమొక యుగంలా గడిపారు.. చెవులు చిల్లులు పడేలా భీకర శబ్దాలతో హోరున గాలులు వీస్తుంటే ఏం జరుగుతుందో తెలియక చిన్నారులు తల్లిదండ్రుల ఒడిలో బిక్కుబిక్కుమంటూ ఒదిగిపోయారు. ప్రళయం.. యుగాంతం అంటే ఇలాగే ఉంటుంది కాబోలు అనుకుంటూ జనం భీతావహులయ్యారు. 3డి సినిమా చూస్తున్నట్లు కళ్లెదుటే పూరిళ్ల పైకప్పులు, కార్లు, ఆటోలు గాల్లో గింగిరాలు తిరుగుతుంటే ‘ఇదేం తుపాను దేవుడా..’ అంటూ వణికిపోయారు. ఉంటున్న ఇల్లుపై ఏ చెట్టు వచ్చి పడుతుందో.. లేక ఆకాశంలోంచి పెద్ద వస్తువులేవైనా పడతాయా అన్నట్లు భయంగొల్పేలా వింత శబ్ధాలు వినిపిస్తుంటే గుండెలు బిగపట్టుకుని ఈ రోజు గడిస్తే చాలనుకుంటూ కాలం గడిపారు.


సాక్షి ప్రతినిధి, చెన్నై: పెను తుపాను వర్దా తమిళనాడును కకావికలం చేసింది. గంటకు 100 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులతో చెన్నైతోపాటు తమిళనాడు తీరప్రాంతం అతలాకుతలమైంది. ప్రధానంగా ఐదు జిల్లాల ప్రజలు వణికిపోయారు. మధ్యాహ్నం 2–4గంటల మధ్యలో చెన్నై తీరాన్ని దాటింది. ఆ సమయంలో గంటకు 120–140 కిలో మీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులతో ప్రజలు భీతిల్లిపోయారు. చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు, విళుపురం, కడలూరు జిల్లాలను  కుదిపేసింది. తెల్లవారుజాము నుంచే భారీ వర్షాలు ప్రారంభమై అనేక వృక్షాలు కూలిపోయా యి. చెన్నై నగరంలో ఉదయం 11 గంటల నుంచి బలమైన ఈదురుగాలులు, జోరున వర్షం ప్రజలను భయంకపితులను చేసింది. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.

మధ్యాహ్నం 1 గంట సమయానికి ప్రకృతి ప్రకోపించినట్లుగా భీకరమైన శబ్దంతో గాలులు వీయడంతో భారీ వృక్షాలు సైతం ఊగిపోతూ కూకటివేర్లతో నేలకొరిగాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలకు అమర్చిన భారీ బోర్డులు గాలిలో చక్కర్లు కొట్టి రోడ్లపై పడిపోయాయి. సహాయక చర్యల నిమిత్తం చెన్నై కార్పొరేషన్‌ ముందు జాగ్రత్త చర్యగా 90 అగ్నిమాపక శకటాలను, 20 పడవలను, 700 మంది సిబ్బందిని సిద్ధం చేసింది. అరక్కోణం సైనిక శిబిరం నుంచి ఐదు బృందాలు ఆదివారం రాత్రే చెన్నైకి చేరుకున్నాయి. చెన్నై, తిరువళ్లూరుకు 3 బృందాలు, కాంచీపురానికి రెండు బృందాలను కేటాయించారు. కోస్ట్‌గార్డ్‌కు చెందిన నౌకలను, చిన్న పాటి బోట్లు, 30 మంది గజ ఈతగాళ్లను తీర ప్రాంతాల్లో ఉంచి అందులో ఐదువేల మందికి సరిపోయే ఆహార పొట్లాలను సిద్ధం చేశారు.  తుపాను కారణంగా విమానాల రాకపోకలను నిలిపి చేశారు. చెన్నై చేరుకోవాల్సిన 25 విమానాలను వివిధ ప్రాంతాలకు దారిమళ్లించారు.

చెన్నైలో స్తంభించిన జన జీవనం
ఉత్తర చెన్నైలోని సముద్రతీర ప్రాంతాలైన కాశీమేడు, తిరువత్తియూరు, ఎన్నూరు తదితర ప్రాంతాలు సముద్రపు ఉప్పెనకు గురి అవుతాయేమో అన్నంతగా భీతికొలిపాయి. తీర ప్రాంతాల్లోని కొన్ని నివాస ప్రాంతాల్లోకి కెరటాలు చొచ్చుకుని వచ్చాయి. ముఖ్యంగా ఎన్నూరులోని ఇందిరా గాంధీ కుప్పం, నెట్టుకుప్పం, ముగత్తువార కుప్పం తదితర ప్రాంతాల్లోకి సముద్రపునీరు చొచ్చుకు రావడంతో రోడ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో ఈ ప్రాంతాల్లో నివసించే వందలాది జాలర్ల కుటుంబాలు ఇళ్లను వదిలి వివిధ పాఠశాలల్లో రెవెన్యూశాఖ ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకున్నారు. చెన్నై నగరం, శివార్లు కలుపుకుని 46 మత్య్సకార గ్రామాల్లో 50 వేల కుటుంబాలు భారీ వర్షంతో వణికిపోయాయి.

చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 32 సముద్రతీర  గ్రామాలను అప్రమత్తం చేయడంతోపాటూ ఆయా ప్రాంతాల నుంచి 3500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నైలో 30, కాంచీపురం 44, తిరువళ్లూరు జిల్లాల్లో 15 సహాయక చర్యల శిబిరాలను ఏర్పాటు చేశారు. తమిళనాడులోని తంజావూరు, నాగపట్టినం జిల్లాలతోపాటూ పుదుచ్చేరీ రాష్ట్రంలో 15 వేల మంది మత్య్సకారులు చేపల వేటకు వెళ్లలేదు. ప్రజలు ఇళ్ల నుండి బైటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. విద్యా సంస్థలన్నింటికీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రయివేటు సంస్థలు సైతం ఉద్యోగులకు సెలవు లేదా ఇంటి నుండే పనిచేసే అవకాశం ఇవ్వాలని సూచించింది. చెన్నై నగరంలోని అనేక లోకల్‌ రైల్వేస్టేషన్లలో పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. రైళ్లు, సిటీ బస్సులు, లోకల్‌ రైళ్లను నిలిపివేశారు. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా తిరుగకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యం గా మారిపోయాయి. చెన్నై నగరంలో 42 వృక్షాలు నేలకొరిగాయి. వృక్షాలన్నీ విద్యుత్‌ వైర్లను లాక్కుంటూ కుప్పకూలడంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలచిపోయింది. తమిళనాడులో తుపాను ధాటికి ముగ్గురు మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

► పెనుగాలులతో కూడిన భారీ వర్షాల వల్ల ఉత్తర తమిళనాడులోని కోస్తా జిల్లాలతో పాటు చెన్నై నగరం అతలాకుతలమైంది. వందలాది గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రోడ్డు, రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో జనజీవనం స్తంభించింది.
► వర్దా తుపాను బుధవారం దక్షిణ గోవా మీదుగా వెళ్లనుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ ఎమ్‌ఎల్‌ సాహు తెలిపారు. నేటి నుంచి ఆ రాష్ట్రంలో చిరు జల్లులు మొదలవుతాయని చెప్పారు.
► కాంచీపురంలోని కల్పకమ్‌ అణు విద్యుత్‌ ప్లాంట్‌ భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్లాంట్‌లో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, ప్లాంట్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు భారత వాతావరణ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపింది. భారత అణు విద్యుత్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యలో ఇక్కడ 2 విద్యుత్‌ ప్లాంట్లు నడుస్తున్నా యి. ఒకదానిలో 440 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుండగా.. 500 మెగా వాట్ల కెపాసిటీ గల మరో ప్లాంట్‌ నిర్మాణంలో ఉంది.

ఎలాంటి సాయానికైనా సిద్ధం: రాజ్‌నాథ్‌
న్యూఢిల్లీ: తమిళనాడు, ఏపీలలో వర్దా తుపాను పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆయా రాష్ట్రాల సీఎంలతో ఫోన్‌లో మాట్లాడారు. ఎలాంటి సహా యానికైనా సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. తుపాను వల్ల జరిగిన నష్టం, తీసుకున్న సహాయక చర్యలను పన్నీర్‌సెల్వం, చంద్రబాబులు.. రాజ్‌నాథ్‌కు వివరించారు.

అప్పటి ధైర్యాన్నే ఇప్పుడూ ప్రదర్శించాలి: సోనియా
వర్దా తుపాను తీరం దాటి చెన్నై, ఇతర జిల్లాలపై విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత కోసం స్థానిక పరిపాలనా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ పేర్కొన్నారు. తుపాను తీవ్రతను నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రకృతి విలయం నుంచి చెన్నై నగరం బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గతేడాది ఇదే నెలలో జరిగిన విధ్వంసం సమయంలో చెన్నై ప్రజలు, తమిళనాడు రాష్ట్రం చూపిన ధైర్యాన్ని ఇప్పుడు కూడా ప్రదర్శిస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు. ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు.

తీరం దాటిన తుపాన్‌
గత ఏడాది భారీ తుపాన్‌ కళ్లెదుట మిగిల్చిన ఆనవాళ్లను మరచిపోక ముందే ‘వర్దా’ విశ్వరూపం ప్రదర్శించింది. 22 ఏళ్ల తర్వాత చెన్నై నగరం మీదుగా తీరం దాటిన తుపాను చెన్నైని కకావికలం చేసింది.1994 అక్టోబరు 31వ తేదీన వచ్చిన తుపాను వల్ల గంటకు 80–100 కి.మీ. వేగంతో గాలు వీచాయి. భారీ వర్షం కురిసింది.  చెన్నై, తిరు వళ్లూరు, కాంచీపురం జిల్లాలు తీవ్రస్థాయిలో నష్టపోగా అప్పట్లో మొత్తం 15 మంది మృత్యువాత పడ్డారు. 2008 నవంబరు 27వ తేదీన ‘నిషా’ తుపాను చెన్నై తీరాన్ని తాకినా గణనీయమైన నష్టం జరగలేదు.

‘విండీటీవీ’తో వర్దా సమాచారం
వర్దా తుపాను చెన్నైను వర్షాలతో ముంచెత్తింది. అన్ని టీవీల్లోనూ ఇవే వార్తలు. తుపాను తాకిడికి విరిగిపోయిన చెట్లు.. కూలిపోయిన గోడలు... బోల్తా పడ్డ ట్యాంకర్లు... ఇలా ఎన్నో వార్తలను మనం చూసుంటాం. కానీ ఇదే సమయంలో కొన్ని కోట్ల మంది వర్దా సమాచారం తెలుసుకునేందుకు దేనిపై ఆధారపడ్డారో తెలుసా? ‘విండీటీవీ’పై. ఇదేదో కొత్త టీవీ చానెల్‌ అనుకునేరు. కానేకాదు. చాలాకాలంగా నావికులు మొదలుకుని గాలిపటాలు ఎగరేసే వారి వరకూ అందరికీ గాలి దిశ, వేగం వంటి వివరాలను అందిస్తున్న వెబ్‌సైట్‌. వర్దా తుపాను తీరానికి కొద్ది దూరంలో ఉన్నప్పుడు విండీటీవీలో కనిపించిన చిత్రం ఇలా ఉంది.. చిత్రంలో కనిపిస్తున్న తెల్లటి చారికలు గాలుల దిశను రంగు వేగాన్ని సూచిస్తోంది.  చూడగానే గాలి ఒకచోట గుండ్రంగా తిరుగుతున్న విషయం అర్థమవుతుంది.

గంటకు రెండు కిలోమీటర్ల వేగాన్ని సూచిస్తోందే... ఆ ప్రాంతమే తుపాను కన్ను! ఈ ప్రాంతం తీరాన్ని దాటినప్పుడు వాతావరణం కొంచెం ప్రశాంతంగా  అనిపిస్తుంది. ఆ తరువాత కొద్ది సమయానికే అసలు ఇబ్బంది మొదలవుతుంది. కన్ను ప్రాంతం నుంచి దూరం ఎక్కువవుతున్న కొద్దీ గాలివేగంలో పెరుగుదల కనిపిస్తూంటుంది. దీనికి తగ్గట్టుగానే విపరీతమైన గాలులు, వర్షాలు, విధ్వంసం ఉంటుంది. మొత్తమ్మీద చూస్తే... తుపాను విధ్వంసాల మధ్య కొంత స్తబ్ధత ఉంటుందన్నమాట. తుపాను ముందటి ప్రశాంతత అన్నమాట! విండీటీవీని మీ స్మార్ట్‌ఫోన్‌(ఆండ్రాయిడ్‌/ఐఫోన్‌)లపై కూడా ఆప్‌రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎప్పుడైనా.. ఎక్కడైనా గాలి వేగం, దిశలతోపాటు ఉష్ణోగ్రతల, మబ్బుల వివరాలు తెలుసుకోవచ్చు.
– సాక్షి, నాలెడ్జ్‌ సెంటర్‌

తూర్పు తీరానే తుపాన్లు ఎక్కువెందుకు?
భారత ద్వీపకల్పానికి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం ఉన్నాయి. కానీ.. పశ్చిమ తీరంతో పోలిస్తే.. తూర్పు తీరంలో బంగాళాఖాతంలోనే ఎక్కువ తుపాన్లు సంభవిస్తుంటాయి. అది కూడా అక్టోబర్, నవంబర్‌ డిసెంబర్‌ నెలల్లోనే అధికంగా విరుచుకుపడుతుంటాయి. ఇందుకు భౌగోళిక, వాతావరణ కారణాలు ఉన్నాయి.
► వాతావరణంలో ఉండే నీటి ఆవిరి ఆధారంగా తుపాన్లు బలపడతాయి. వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి మోతాదు.. నీటి ఉపరితలం మీద ఉష్ణోగ్రతకు, గాలి ఉష్ణోగ్రతకు మధ్య గల తేడాపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాంతంలో నదులు ఎక్కువగా ఉండటం వల్ల బంగాళాఖాతంలో మంచి నీరు ఎక్కువగా ఉంటుంది. సముద్రంలోని ఉప్పు నీటికన్నా మంచి నీరు తేలికగా ఉంటుంది కాబట్టి.. అది ఉపరితలంపై ఒక పలుచటి పొరలా ఏర్పడుతుంది. ఈ పలుచటి పొర చాలా సులభంగా వేడెక్కి ఆవిరిగా మారుతుంది. అదే అరేబియా సముద్రంలో ఇలా త్వరగా వేడెక్కే పలుచటి మంచినీటి పొర ఉండదు.
► అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతం వేడిగా ఉంటుంది. తుపాన్లు ఏర్పడటానికి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వేడిగా ఉండాలి. బంగాళాఖాతానికి మూడు వైపులా భూమి ఉంటుంది. కేవలం ఒకే వైపు హిందూమహాసముద్రంతో అనుసంధానమై ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ నెలల్లో సముద్ర ఉపరితలం మీద ఉష్ణోగ్రతకు.. మూడు వైపులా ఉండే భూభాగాల మీద ఉష్ణోగ్రతకు చాలా తేడాలు ఉంటాయి. ఈ తేడాలతో వాయు పీడనం పెరుగుతుంది.
► తూర్పు గాలుల ప్రవాహం పశ్చిమాన టిబెట్‌ వరకూ విస్తరించి ఉంటుంది. ఈ గాలి గమనం సుమారుగా కోల్‌కతా – బెంగళూరు కోణంలో సాగుతుంది. ఈ పై గాలుల తూర్పు ప్రవాహం నేరుగా.. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన శాశ్వత అధిక పీడన ప్రాంతంలోకి దిగుతుంది. వాతావరణ పొరలు కలిసే చోట అది దారి మార్చుకుంటుంది. సెప్టెంబర్‌ చివరి నాటికి అది తూర్పు నుంచి పడమర దిశగా స్థిరపడి పశ్చిమం వైపు.. అంటే భారత తూర్పు తీరం వైపు వీయడం మొదలవుతుంది. ఇదులో తుపానులు పుడతాయి.

బంగాళాఖాతం భారీ తుపాన్లకు కేరాఫ్‌..   
అక్టోబర్‌ 2014: హుదూద్‌ తుఫాను. విశాఖపట్నం సమీపంలో తీరం దాటింది. గంటకు 205 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో 100 మందికి పైగా చనిపోయారు. 3.50 లక్షల మందిని ఖాళీ చేయించారు. 21 లక్షల కుటుంబాలపై ప్రభావం చూపింది.
అక్టోబర్‌ 2013: ఫాలిన్‌ తుఫాను. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ తీరాల్లో 5.50 లక్షల మందిని ఖాళీ చేయించారు.
మే 2008: నర్గీస్‌ తుఫాను. మయన్మార్‌లోని ఇర్రవడీ నదీ డెల్టా ప్రాంతంలో 1.38 లక్షల మందిని బలితీసుకుంది. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వెయ్యి కోట్ల డాలర్ల ఆస్తి నష్టం సంభవించింది.
అక్టోబర్‌ 1999: ఒడిషాను పెను తుపాను కబళించింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. 10 వేల మంది బలయ్యారు. మరో 15 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
ఏప్రిల్‌ 1991: బంగ్లాదేశ్‌ను భారీ తుపాను ముంచెత్తింది. దాదాపు 1.39 లక్షల మంది మృత్యువాతపడ్డారు. గంటకు 225 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
నవంబర్‌ 1977: భీకరమైన తుపాను ఆంధ్రప్రదేశ్‌పై పంజా విసిరింది. దివిసీమ చావుసీమ అయింది. అధికారిక లెక్క ప్రకారం 14,204 మంది చనిపోయారు. అనధికారిక అంచనా ప్రకారం మృతుల సంఖ్య 50 వేలు దాటింది.
నవంబర్‌ 1970: తూర్పు పాకిస్తాన్‌ (ఇప్పటి బంగ్లాదేశ్‌)ను భారీ తుపాను తాకింది. మూడు లక్షల మందికి పైగా ప్రజలు అసువులుబాశారు. గంటకు 224 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement