మా ఊరికి రైలొచ్చిందోచ్...! | Arunachal's capital becomes rail-connected | Sakshi
Sakshi News home page

మా ఊరికి రైలొచ్చిందోచ్...!

Apr 9 2014 5:41 PM | Updated on Sep 2 2017 5:48 AM

మా ఊరికి రైలొచ్చిందోచ్...!

మా ఊరికి రైలొచ్చిందోచ్...!

అరుణాచల్ రైలు కల నెరవేరింది. ఇటానగర్ కి రైలు కళ వచ్చేసింది.

సంప్రదాయ దుస్తులతో తండోపతండాలుగా ప్రజలు పట్టాలకు ఇరు వైపులా నిల్చుని, హారతులు పట్టి, జెండాలు ఊపి, నృత్యాలు చేసి, రైలు డ్రైవర్లను పూల దండలతో ముంచేసి, ఆ రైలుకు స్వాగతం పలికారు.


ఆ రైలు ఉదయం ఏడు గంటలకు ప్రయాణమై, మధ్యాహ్నం 12.30 కి గమ్యం చేరుకుంది. దారి పొడవునా పండుగ వాతావరణం నెలకొంది.
అసొంలోని డెకార్ గావ్ నుంచి అరుణాచల్ రాజధాని ఇటా నగర్ కి మొట్టమొదటిసారి రైలు వచ్చిన దృశ్యం అది. దీంతో ఈశాన్య భారతదేశంలో రైలు కనెక్టివిటీ ఉన్న రెండో రాజధానిగా ఈటానగర్ చరిత్రకెక్కింది.


ఇలా అరుణాచల్ రైలు కల నెరవేరింది. ఇటానగర్ కి రైలు కళ వచ్చేసింది.


పది మంది ప్రయాణికులు, రెండు గూడ్సు కంపార్ట్ మెంట్లతో కూడిన ఆ రైలు రావడంతో ఇటానగర్ రైల్వే స్టేషన్ లో 'జై విశ్వకర్మ' అన్న నినాదాలు మిన్ను ముట్టాయి. ఈశాన్యభారతదేశం, బెంగాల్, ఒడిశా లలో మెకానికల్ వస్తువులు, యంత్రాలకు విశ్వకర్మ ఆది దేవుడిగా భావిస్తారు. ఈ రైలు ప్రారంభం కావడంతో బుధవారం యాత్రీకులందరికీ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. ఎవరు ఎక్కడైనా ఎక్కొచ్చు. ఎక్కడైనా దిగొచ్చు. వీరంతా అరుణాచల్ ప్రదేశ్ కి తమ తొలి రైలు ప్రయాణాన్ని సెల్ ఫోన్లలో బంధించారు.


ఈ రైలును ఏర్పాటు చేస్తామని 1997 లో అప్పటి రైల్వే మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రకటించారు. దీన్ని పూర్తి చేస్తామని 2008 లో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ఇన్నాళ్లకి అరుణాచల్ ప్రదేశ్ రైలు కల నిజమైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement