పాకిస్తాన్‌ తీరుపై మండిపడ్డ భారత ఆర్మీ చీఫ్‌

Army Chief MM Naravane Slams Pakistan Over Ceasefire Violation Covid 19 - Sakshi

శ్రీనగర్‌: ప్రపంచమంతా కరోనా(కోవిడ్‌-19) మహమ్మారిని తరిమికొట్టేందుకు పోరాడుతుంటే పాకిస్తాన్‌ మాత్రం తన తీరును మార్చుకోవడం లేదని భారత ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవాణే ఆగ్రహం వ్యక్తం చేశారు. దాయాది దేశం నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) రేఖ వద్ద పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న వేళ సరిహద్ద వెంబడి పాక్‌ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా పరిస్థితులను పర్యవేక్షించేందుకు నరవాణే రెండు రోజుల పర్యటన నిమిత్తం కశ్మీర్‌కు వెళ్లారు. 

ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ‘‘భారత్‌ సహా ఇతర ప్రపంచ దేశాలు మహమ్మారిని ఎదుర్కొనేందుకు పోరాటం చేస్తుంటే పొరుగు దేశం మాత్రం మనల్ని ప్రమాదంలో పడేయాలని చూడటం అత్యంత దురదృష్టకరం’’అని పేర్కొన్నారు. ‘‘మన పౌరులను కాపాడుకుంటూనే.. ఇతర దేశాలకు వైద్య బృందాలను పంపిస్తూ... ఔషధాలు ఎగుమతి చేస్తూ మనం బిజీగా ఉంటే... మరోవైపు పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని పెంపొందిస్తోంది. ఇది ఏమాత్రం శుభ శకునం కాదు’’అని నరవాణే పాక్‌ తీరును ఎండగట్టారు. ఇక భారత సైన్యంలో ఇప్పటి వరకు ఎనిమిది మందికి కరోనా సోకగా.. ఒకరు పూర్తిగా కోలుకుని విధుల్లో చేరారని నరవాణే వెల్లడించారు.(జమ్మూ కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్‌)

కాగా జమ్మూ కశ్మీర్‌లోని కీరన్‌ సెక్టార్‌ పరిధిలో ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసి)కు ఎదురుగా ఉన్న దూద్‌నైల్లో కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్‌ ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 10న దూద్‌నైల్‌లోని టెర్రర్ లాంచ్ ప్యాడ్ల వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ఉగ్రవాదులతో పాటు 15 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులను మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top