‘కాంగ్రెస్‌’కు అంబానీ లీగల్‌ నోటీసులు

Anil Ambani send Legal Notices to Congress Party - Sakshi

రాఫెల్‌ ఒప్పందంపై విమర్శలు ఆపాలని సూచన

నోటీసులకు భయపడబోమన్న కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: రాఫెల్‌ ఒప్పందంలో భారీగా లబ్ధి పొందారంటూ అనిల్‌ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్‌ గ్రూప్‌పై కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలపై ఆ సంస్థ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్‌ నేతలు రాఫెల్‌ ఒప్పందంపై చేస్తున్న అసత్య ఆరోపణలను మానుకోవాలంటూ లీగల్‌ నోటీసులు పంపిం ది. రాఫెల్‌ ఒప్పందంలో ప్రధాని మోదీ, బీజేపీ లక్ష్యంగా నెలరోజులపాటు దేశవ్యాప్తంగా.. నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రిలయన్స్‌ గ్రూప్‌ నోటీసులు జారీ చేయడం గమనార్హం. రాఫెల్‌ కుంభకోణం జరిగిందని విమర్శిస్తున్న రాహుల్‌ గాంధీ.. ఓ వ్యాపారవేత్తకు లాభం మేలుచేకూర్చేందుకే మోదీ ఒప్పందం మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు.

ఇటీవల పార్టీ అధ్య క్షుడు రాహుల్‌కు రాసిన లేఖలోనూ అనిల్‌ అంబానీ అభ్యం తరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘వ్యాపార ప్రత్యర్థులు స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న దుష్ప్రచారంలో భాగంగానే కాంగ్రెస్‌ తప్పుడు సమాచారం అందింది’అని ఆ లేఖలో రాహుల్‌కు అనిల్‌ అంబానీ సూచించారు. అయితే ఇలాంటి నోటీసులుకు భయపడబోమని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న కాంగ్రెస్‌ ఎంపీ సునీల్‌ జఖడ్‌.. రాఫెల్‌ ఒప్పందం దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన విషయమన్నారు.

ఈ నోటీసులు.. బీజేపీ, కార్పొరేట్‌ కంపెనీల మధ్య సంబంధానికి సాక్ష్యమని ఆయన అన్నారు. ‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. ఎన్నికైన ప్రజాప్రతినిధికి ఓ వ్యాపారవేత్త లీగల్‌ నోటీసులు పంపడం చాలా సీరియస్‌ అంశం. బీజేపీ, కార్పొరేట్‌ కంపెనీల మధ్య సంబంధంపై మా పోరాటం కొనసాగుతుంది’అని జక్కడ్‌ వెల్లడించారు. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్‌ డిఫెన్స్, రిలయన్స్‌ ఏరోస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ కంపెనీల పేర్లతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు శక్తిసింగ్‌ గోహిల్, ప్రియాంక చతుర్వేది, జైవీర్‌ షెర్గిల్‌లు కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top