ఉన్నావ్‌ బాధితురాలి మృతి: అఖిలేష్‌ ధర్నా

Akhilesh Yadav Protest Against Unnao Victim Murder - Sakshi

లక్నో: ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి మృతిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలి హత్యకు నిరసనగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్‌, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ రాష్ట్ర విధానసభ వద్ద ధర్నాకు దిగారు. హత్యకు ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమే కారణమంటూ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత కరువైందని విమర్శించారు. ఉన్నావ్‌ బాధితురాలి హత్యకు కారణమైన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని అఖిలేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు యోగి సర్కారే ప్రథమ దోషి అని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ చరిత్రలో ఈరోజు బ్లాక్‌ డే అని అఖిలేష్‌ విమర్శించారు. మరోవైపు ఈ ఘటనపై వివిధ వర్గాల చెందిన ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిందితులను వెంటనే శిక్షించాలని మహిళలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం నిందితులను కాపాడుతోందంటూ కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. బాధితురాలి మృతికి నిరసనగా ఢిల్లీలోనూ పలువురు ధర్నా చేపట్టారు. కాగా బాధిత యువతి కుటుంబ సభ్యులను ప్రియాంక గాంధీ పరామర్శించే అవకాశం ఉంది. ఈ  ఘటనపై ఆమె ఇదివరకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


కాగా ఉన్నావ్‌ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, విచారణ నేపథ్యంలో గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. చనిపోయే ముందు బాధితురాలు మెజిస్ట్రేట్‌ ముందు ఇచ్చిన వాంగ్మూలం మేరకు.. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేసి ఘటనపై విచారణ చేపడుతామని సీఎం యోగి ఆదిత్యానాథ్‌ తెలిపారు. కాగా బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు ఢిల్లీ నుంచి లక్నోకు తరలించారు. ఈ సందర్భంగా ఏలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా ఆమె ఇంటి వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top