చర్చలకు పిలిచి చైనా దాడులు చేస్తోంది

air force chief RKS Bhadauria Passing Out Parade In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సరిహద్దుల్లో భారత్‌ ఎప్పుడూ శాంతి మంత్రాన్ని పాటిస్తుందని భారత వైమానిక దళాధిపతి‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా స్పష్టం చేశారు. భారత సైనికులపై కవ్వింపులకు దిగితే మాత్రం అదే రీతిలో సమాధానం చెప్పగల సత్తా మన సైన్యం వద్ద ఉందని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌ సమీపంలోని దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా విధుల్లో చేరబోతున్న క్యాడేట్లను ఉద్దేశించి భదౌరియా ప్రసంగించారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటననను ఆయన గుర్తుచేశారు. చైనా ఆగడాలను ఎల్లప్పుడూ తిప్పుకొడుతున్న భారత జవాన్ల పోరాట పటిమను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. (చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం)

పరేడ్‌ సందర్భంగా భదౌరియా మాట్లాడుతూ.. ‘చైనా సరిహద్దుల్లో అమరవీరుడైన కల్నల్ సంతోష్ బాబుతో పాటు 19 మందికి నివాళులు అర్పిస్తున్నాం. వారి ధైర్యం సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలి. లడఖ్‌లో ప్రస్తుత పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. చర్చలు అని చెప్పి చైనా దాడులకు పాల్పడుతుంది. దేనికైనా సరే మనం సిద్ధంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాయుసేన సిద్ధంగా ఉంది. ఎలాంటి ప్రతికూల వాతావరణం లో అయినా దేశ సేవ ప్రధానం. పీపుల్ సేఫ్టీ ఫస్ట్.. మిషన్ ఆల్ వేస్... ఎప్పటికి మరిచిపోవద్దు. తమ పిల్లల కళను సాకారం చేసిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. గాల్వాన్ అమరుల త్యాగాలను వృథా కానివ్వం.’ అని పేర్కొన్నారు. 

కాగా పరేడ్‌ సందర్భంగా క్యాడేట్ల చేత గౌరవ వందన్నాన్ని చీఫ్‌ మార్షల్‌ స్వీకరించారు. కోవిడ్ 19 నేపధ్యంలో పరేడ్ తిలకించడానికి క్యాడేట్ల కుటుంబ సభ్యులకు అనుమతి నిరాకరించారు. కాగా మొత్తం 123 మంది క్యాడేట్లలో 19 మంది బాలికలు ఉన్నారు. వీరందరికీ చీఫ్‌ మార్షల్‌ అభినందనలు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top