
పెళ్లి కావడం లేదని వ్యక్తి ఆత్మహత్య
వయసు 38 ఏళ్లు దాటుతున్నా వివాహం కాకపోవడంతో మనో వేదనకు గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బనశంకరి: వయసు 38 ఏళ్లు దాటుతున్నా వివాహం కాకపోవడంతో మనో వేదనకు గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహదేవపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు... ఉదయనగరలోని వివేకానంద స్ట్రీట్‌కు చెందిన మంజునాథరావ్(38) తల్లితో కలిసి నివాసముంటున్నాడు. పీయూసీ వరకు చదువుకున్న మంజునాథరావ్ ప్రస్తుతం ఏ ఉద్యోగం చేయడం లేదు. గత కొన్నేళ్లుగా వివాహం చేయడానికి పలుచోట్ల పెళ్లి సంబంధాలు చూసినప్పటికీ ఎవరూ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయడానికి ముందుకు రాలేదు.
దీంతో మనోవేదనకు గురైన మంజునాథరావ్ గురువారం తల్లి గార్మెంట్స్‌కు వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి చేరుకోగా కుమారుడి ఆత్మహత్య విషయం వెలుగుచూసింది. మహదేవపుర పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం బౌరింగ్ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.