వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కోట్లు పెంచి..
- వ్యవసాయోత్పత్తులకు న్యాయమైన ధర లభించేందుకు ‘జాతీయ వ్యవసాయ మార్కెట్’ ఏర్పాటు
- ఆహార భద్రత సహా 10 ప్రధాన పథకాలను విలీనం చేసి ‘కృషియోన్నతి యోజన’
- పీఎంజీఎస్‌వై కోసం రూ. 5,300 కోట్లు
న్యూఢిల్లీ: వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కోట్లు పెంచి.. రూ. 8.5 లక్షల కోట్లకు చేర్చినట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. బ్యాంకులు ఈ లక్ష్యాన్ని అధిగమించగలవన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే, అన్నదాతలకు మెరుగైన ఆదాయాన్ని అందించే లక్ష్యంతో ‘జాతీయ ఉమ్మడి వ్యవసాయ మార్కెట్’ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
జాతీయ ఆహార భద్రత పథకం సహా 10 ప్రధాన పథకాలను విలీనం చేసి ‘కృషియోన్నతి యోజన’ను ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. రూ. 9 వేల కోట్ల కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో రాష్ట్రాలే ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతీ రైతు భూమికి సాగునీరు, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పెంచేలా జలవనరుల సమర్థ వినియోగం లక్ష్యాలుగా రూపొందిన ప్రధానమంత్రి గ్రామ సించయ్ యోజన(పీఎంజీఎస్‌వై), మైక్రో ఇరిగేషన్ వాటర్ షెడ్ పథకాల అమలుకు రూ. 5,300 కోట్లు కేటాయించామన్నారు.
పీఎంజీఎస్‌వై కోసం ఈ సంవత్సరం మరో 3 వేల కోట్ల రూపాయల మేరకు కేటాయింపులను ప్రభుత్వం పెంచాలనుకుంటోందని వెల్లడించారు. అలాగే, వ్యవసాయ శాఖ ప్రారంభించిన సేంద్రియ వ్యవసాయ పథకం ‘పరంపర కృషి వికాస యోజన’కు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఈ పథకాల్లో రాష్ట్రాలు కూడా ఆర్థికంగా పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. సన్న, చిన్నకారు రైతులపై ప్రత్యేక దృష్టిపెట్టి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ రుణాలను వారికందేలా చర్యలు చేపట్టామని జైట్లీ తెలిపారు. ఇప్పటివరకు 7% వార్షిక వడ్డీతో రూ. 3 లక్షలవరకు రైతులు వ్యవసాయ రుణాలు పొందుతున్నారు. సరైన సమయానికి రుణాన్ని చెల్లిస్తే 4% వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2014-15) లక్ష్యం రూ. 8 లక్షల కోట్లలో సెప్టెంబర్ నెలవరకు రూ. 3.7 లక్షల కోట్లను బ్యాంకులు రైతులకు రుణాలుగా ఇచ్చాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం పెంపుతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించి జైట్లీ ప్రకటనలు
- నాబార్డ్ ఆధ్వర్యంలోని గ్రామీణ మౌలికవసతుల అభివృద్ధి నిధికి రూ. 25 వేల కోట్లు.
- దీర్ఘకాలిక రుణ నిధి కోసం రూ. 15 వేల కోట్లు.
- సహకార స్వల్పకాలిక రుణాల రీఫైనాన్స్ ఫండ్ కోసం రూ. 45 వేల కోట్లు.
- బ్యాంకుల స్వల్పకాలిక రుణాల రీఫైనాన్స్ ఫండ్ కోసం రూ. 15 వేల కోట్లు.
- మైక్రో ఇరిగేషన్ వాటర్ షెడ్ పథకాలకు రూ. 5,300 కోట్లు.
రైతుల ఆదాయాన్ని పెంచాలి
దిగుబడి పెంపు, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధరలు కల్పించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని అరుణ్ జైట్లీ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు ఇప్పటికీ న్యాయమైన ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయోత్పత్తుల ధరల నియంత్రణ కోసం ‘జాతీయ ఉమ్మడి వ్యవసాయ మార్కెట్(నేషనల్ కామన్ మార్కెట్)’ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. ధరల నియంత్రణ ద్వారా జాతీయ మార్కెట్ రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఇందులో రాష్ట్రాలను భాగస్వాములను చేయటంపై చర్చిస్తానని జైట్లీ చెప్పారు.
ఒకవేళ రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అంగీకరించని పక్షంలో.. అవసరమైతే రాజ్యాంగ నిబంధనల సహకారం తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘సాగు భూమి విస్తీర్ణంలో పెరుగుదల, సమర్ధ సాగునీటి పథకాల నిర్వహణ, వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం, విలువల జోడింపు, వ్యవసాయ ఆదాయం పెంపు, వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన ధర’.. వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని జైట్లీ వివరించారు. తోటల పెంపకంలో అధ్యయనం, పరిశోధన కోసం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉద్యానవన పీజీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
‘వ్యవసాయరంగ అభివృద్ధికి దోహదం చేసే బడ్జెట్. వ్యవసాయ దిగుబడులు, రైతుల ఆదాయం, సాగుభూమి విస్తీర్ణం పెరిగేందుకు ఈ బడ్జెట్‌లో ప్రణాళిక ఉంది’
- రాధామోహన్ సింగ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
‘12వ పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్న 4% వ్యవసాయ రంగ వృద్ధి రేటు లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన ఆర్థిక ప్రణాళిక బడ్జెట్లో కనిపించలేదు’
- అశోక్ గులాటీ, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) మాజీ చీఫ్