ఈ వారం యూట్యూబ్ హిట్స్‌ | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

Published Mon, Jul 23 2018 2:30 AM

YouTube hits this week - Sakshi

ఆక్వామ్యాన్‌ – ట్రైలర్‌
నిడివి 2 ని. 26 సె., హిట్స్‌ 100,39,812
కామిక్స్‌ నుంచి సూపర్‌ హీరో సినిమాలు రూపొందిస్తూనే వస్తున్నాయి మార్వెల్, డీసీ. తాజాగా తమ ఫ్రాంచైజ్‌లో మరో కొత్త సూపర్‌ హీరో ఆక్వామ్యాన్‌ను పరిచయం చేసింది. ఆక్వామ్యాన్‌ క్యారెక్టర్‌ మీద వస్తున్న ఫస్ట్‌ సినిమా కావడంతో డీసీ కామిక్స్‌ అభిమానులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. మార్వెల్‌తో పోలిస్తే డీసీ కామిక్స్‌  ఈ మధ్య కొంచెం వెనకబడటమే అందుకు కారణం. ఆ లోటుని కచ్చితంగా తీర్చేలా దర్శకుడు జేమ్స్‌ వాన్‌ రూపొందించారని ట్రైలర్‌ను చూస్తేనే అనిపిస్తోంది.

అటు సముద్ర గర్భానికి, ఇటు భూమికి చెందిన వాడిగా కనిపిస్తాడు హీరో. అట్లాంటిస్‌ (సముద్ర గర్భం)కి భూమికీ మధ్య జరిగే పోరులో హీరో ఎవరి వైపు నిలబడతాడన్నది తెలియాలంటే డిసెంబర్‌ 21 వరకు ఆగాల్సిందే. అండర్‌ వాటర్‌ యాక్షన్‌ సీక్వెన్స్, గ్రాఫిక్స్‌ ట్రైలర్‌ని అత్యద్భుతంగా మార్చాయి. రిలీజ్‌ అయిన కొన్ని గంటల్లోనే యుట్యూబ్‌లో టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతుందీ ట్రైలర్‌.

ప్యార్‌ ప్రేమా కాదల్‌ – ట్రైలర్‌
నిడివి 1. 49 సె. ,హిట్స్‌ 17,52,809
ప్యార్‌.. ప్రేమ.. కాదల్‌. హిందీలో అన్నా, తెలుగులో పలికినా, తమిళంలో చెప్పినా ఒకటే మాట, ప్రేమ.  అలాగే ప్రేమకథలకు ఏ భాషైనా ఒకటే. కానీ ఎలా చెబుతారన్నది అందులోని విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఓ మోడ్రన్‌ అమ్మాయి. ముద్దపప్పు లాంటి అబ్బాయి మధ్యలో ఏర్పడ్డ తమిళ ప్రేమ కథ  చిత్రమే ‘ప్యార్‌ ప్రేమ కాదల్‌’. ‘మా ఇంట్లో ఎవరూ లేరు ఆలస్యంగా వెళ్లినా ఏం ప్రాబ్లమ్‌ లేదు’ అని హీరోయిన్‌ ఎంత హింట్‌ ఇచ్చినా అర్థం చేసుకోలేనంత తింగరబుచ్చి మన హీరోగారు.

లాస్‌ ఏంజెల్స్‌లో రెస్టారెంట్‌ ఓపెన్‌ చేయాలనుకుంటుంది హీరోయిన్‌ అసలు లాస్‌ ఏంజెల్స్‌ అంటే ఎక్కడో సరిగ్గా తెలియదు హీరోకు. ఈ రొమాంటిక్‌ కామెడీ ట్రైలర్‌ కచ్చితంగా నవ్వులు పూయిస్తూంది. ఈ సినిమాను సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూరుస్తూ నిర్మించారు. హరీష్‌ కల్యాణ్, రైజా పెయిర్‌ చాలా ఫ్రెష్‌గా ఉండటం, ఆహ్లాదకరమైన సంగీతం, విజువల్స్‌ ట్రైలర్‌కు పెద్ద ప్లస్‌.

బోనం పాట – ఫెస్టివల్‌ సాంగ్‌
నిడివి 4 ని. 20 సె. ,హిట్స్‌ 31,43,936
తెలంగాణలో బోనాల పండుగ హడావిడి స్టార్ట్‌ అయిపోయింది. అన్ని చోట్లా పండగ వాతావరణమే కనిపిస్తోంది. అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భక్తులు సిద్ధవుతున్నారు. తమవంతుగా యూట్యూబ్‌లో బోనాలు పండగ విశేషాలను వివరిస్తున్న ‘బోనాలు సాంగ్‌’ ట్రెండింగ్‌లో నిలిచింది. హైదరాబాద్‌ ట్విన్‌ సిటీలలో ఈ పండుగను ఎంత ఘనంగా జరుపుకుంటారో చూపించే ప్రయత్నం చే సింది ఈ యుట్యూబ్‌ చానల్‌.

నాలుగు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో పండగ విశేషాలను  తిరుపతి మట్ల రచించి మంగళితో కలసి పాడారు. ఈ పాట వింటుంటే ఆటోమేటిక్‌గా పండుగ మూడ్‌లోకి వెళ్లిపోక మానలేం. ఈ పండుగ రోజుల్లో దేవతలకు భక్తులు ఎలాంటి సమర్పణలు అందిస్తుంటారంటూ చూపించారు దాము రెడ్డి. ఈ పాటకు యుట్యూబ్‌లో విశేష స్పందన లభిస్తోంది. ఆల్రెడీ మూడు లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.

Advertisement
Advertisement