
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లోకి వస్తున్నామంటూ పోటాపోటీగా ప్రజల ముందుకు రానున్న నటులు కమల్‌హాసన్, రజనీకాంత్ ప్రజల నోళ్లలో నానేందుకు తరచూ అనేక కబుర్లు వినిపిస్తున్నారు. పార్టీ పెట్టేవరకూ తమ రాజకీయ ఊహాగానాల ఉనికిని కాపాడుకునేందుకు గురువారం ఇరువురు నటులు వేర్వేరుగా చర్చనీయాంశమయ్యారు.
తమిళనాడు నుంచి వెలువడుతున్న ఒక ప్రముఖ తమిళ వారపత్రికలో కమల్‌హాసన్ ధారావాహిక ఇంటర్వ్యూ ప్రచురితం అవుతోంది. గతంలో తన ఇంటర్వూల్లో సినిమా సంగతులకే ప్రాధాన్యతనిచ్చే కమల్‌హాసన్ నేడు రాజకీయాలకే ఎక్కువశాతం కేటాయిస్తున్నారు. పైగా తనతోపాటూ సహనటులు రజనీకాంత్ సైతం పార్టీ పెట్టే సన్నాహాలు చేయడం కమల్‌కు ఇరకాటంగా మారింది. వెండితెరపై వసూళ్ల వర్షం కురిపించే రారాజుగా రజనీ వెలిగిపోతుండగా, నట విశ్వరూపంలో కమల్‌హాసన్‌ది పైచేయిగా ఉంది. ఇలా భిన్నమైన ధోరణిలో వెండితెరపై పోటీపడుతున్న రజనీ, కమల్ మధ్య ప్రస్తుతం రాజకీయ తెరపై కూడా పోటీ నెలకొంది. ఇరువరి మధ్య ఉన్న స్నేహం దృష్ట్యా రాజకీయాల్లో కలిసి పనిచేయాలని కొందరు ఆశిస్తున్నారు. ఇదే విషయాన్ని రజనీ వద్ద గురువారం కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘కాలమే నిర్ణయిస్తుంది’ అని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు.
కాకతాళీయమైనా..కమల్ సైతం తన ధారావాహిక తాజా సీరియల్‌లో ఇద్దరి మధ్య పొత్తుపై ప్రస్తావన వచ్చినపుడు రజనీ చెప్పిన సమాధానమే చెప్పారు. ఇద్దరి భావాలు, లక్ష్యాలు ఒకటే. అయితే తామిద్దరం ఒకటిగా చేరాలా వద్దా అనే విషయం ఇప్పట్లో అప్రస్తుతం. ఈ విషయాన్ని మేమిద్దరం కూర్చుని మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాల్సిన అంశం. రజనీ మనస్సులో ఆయనకు సంబంధించిన అంశాలు పరుగులు పెడుతుంటాయని కమల్ పేర్కొన్నారు. దేశంలో గ్రామీణ వికాసం ఎంతో అవసరమనని అందుకే తన రాజకీయాల్లో గ్రామీణ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని తెలిపారు. నా పార్టీలో చేర్చుకునేందుకు ఇతర పార్టీల వారిని కలవడం లేదు, వారి అనుభవాన్ని తెలుసుకుని అమలుచేసేందుకే కలుస్తున్నానని కమల్ చెప్పారు.