నాటకాలపై మక్కువతో..

Take A Look On How Nani Turned As Actor - Sakshi

సినిమా, టీవీ సీరియళ్లలో రాణిస్తున్న ఊట్కూర్‌ యువకుడు

డ్యాన్స్, పాటలు, డైలాగ్‌లు చెప్పడంలో ప్రతిభ

పలు సీరియళ్లలో పాత్రలు పోషిస్తూ గుర్తింపు

ఊట్కూర్‌ (మక్తల్‌): నాటకాలపై చిన్ననాటి నుంచే మక్కువ ఉండడంతోపాటు.. డ్యాన్స్, పాటలు, డైలాగ్‌లు చెప్పడంలో ప్రతిభ కనబరుస్తుండేవాడు నాని. ఆ కళలనే నమ్ముకొని ఎలాగైనా టీవీ, సినిమా రంగాల్లో ప్రతిభ కనబర్చాలని పొట్టుచేత పట్టుకొని హైదరాబాద్‌ వెళ్లాడు. పట్టుదలగా ప్రయత్నించి.. ప్రస్తుతం పలు సీరియళ్లు, సినిమాలలో నటిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నాడు.

తండ్రి మరణంతో బతుకుదెరువు కోసం.. 
ఊట్కూర్‌ మండలంలోని కొల్లూర్‌ గ్రామ పంచాయతీలో కారోబార్‌గా పనిచేస్తున్న ఏసప్ప, కమలమ్మ కుమారుడు తిమోతి (నాని). గ్రామంలో 5వ తరగతి వరకు చదువుకున్నాడు. ఊట్కూర్‌లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పూర్తిచేశాడు. తండ్రి మృతి చెందడంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలో వదిలి జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడే ఓ కాఫీ హౌస్‌లో పనిచేస్తుండగా సీనిమా ఇండ్రస్ట్రీలో పనిచేస్తున్న సంజీవ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనకు నటన అంటే ఇష్టమని, పాఠశాలలో వార్సికోత్సవాల్లో చిన్న, చిన్న నాటకాలు వేసేవాడినని తనకు సినిమా ఇండ్రస్టీలో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరడంతో ఆఫిస్‌ బాయ్‌గా నియమించాడు.

ఆఫీస్‌ బాయ్‌ నుంచి ఆర్టిస్టుగా.. 
కుటుంబ భారాన్ని మోసేందుకు కాఫీ షాపులో పనిచేస్తూనే.. మరో వైపు తనకు బాగా ఇష్టమైన నాటకాలు, డ్యాన్స్, డైలాగ్‌లు చెప్పడంపై నాని మరింత నైపుణ్యం పొందాడు. కొంత మంది ప్రొడ్యూసర్లు, డైరక్టర్లు పరిచయం కావడంతో వారి సహకారంలో సినిమాల్లో, సీరియళ్లలో చిన్న, చిన్న ప్రాతలు వేస్తూ ప్రతిభ కనబరుస్తున్నాడు. సినీ హీరోలు నరేశ్, రాజ్‌తరుణ్, కమేడియన్‌ రఘుబాబు, పాసాని కృష్ణమురళి తదితరులతో కలిసి పాత్రలు వేశాడు. జెమిని, జీ తెలుగు, మా టీవీలలో సీరియళ్లలో నటిస్తున్నాడు. పల్లెటూరి యువకుడు.. సినిమాల్లో, టీవీ సీరియల్‌లలో నటించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నటిస్తున్న సీరియళ్లు ఇవే.. 
జెమిని టీవీలో మధుమాసం, రెండు రెండ్ల ఆరు, అభిలాశ, జీ టీవీలో బంగారు గాజులు, రాధమ్మ కూతురు, గుండమ్మ కథ, మా టీవీలో వదినమ్మ, లక్ష్మికళ్యాణం, కృష్ణవేణి సీరియళ్లలో నటిస్తున్నాడు. తమ గ్రామ యువకుడు  టీవీ సీరియళ్లలో ప్రతిభ కనబర్చడంపై నానిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top