గుమ్మడికాయ కొట్టారు

Shoot of Jyothika And Revathy Starrer Action Comedy Wrapped Up - Sakshi

జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. పేరులోనే జ్యోతిని చేర్చుకున్న నటి జ్యోతిక కథానాయకిగానూ వెలిగిపోతున్నారు. ముఖ్యంగా వివాహానంతరం హీరోయిన్‌ సెంట్రిక్‌ పాత్రల్లో నటిస్తూ వసుస విజయాలను అందుకుంటున్నారు. అలా ఈమె నటించిన 36 వయదినిలే, మగళీర్‌ మట్టుమ్, నాచ్చియార్, కాట్రిన్‌ మొళి చిత్రాల్లో మహిళలకు ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో నటించి సక్సెస్‌ సాధించారు.

ప్రస్తుతం జ్యోతిక నటిస్తున్న తాజా చిత్రాన్ని ఆయన భర్త, నటుడు సూర్య తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. దీనికి కల్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు ‘గులేభకావళీ’వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ చిత్రంలో జ్యోతికతో పాటు నటి రేవతి, యోగిబాబు, ఆనంద్‌రాజ్, మన్సూర్‌అలీఖాన్, మొట్టైరాజేంద్రన్, జగన్‌ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇదీ వినోదభరితంగా సాగే చిత్రమంటున్నాయి చిత్ర వర్గాలు.

అంతే కాకుండా, నటుడు సూర్య నిర్మిస్తుండడంతో మంచి సందేశం కూడా ఉంటుందని భావించవచ్చు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇటీవల చెన్నైలోని బిన్ని మిల్లులో ఒక పాటను చిత్రీకరించారు. చిత్ర షూటింగ్‌ను ప్రణాళిక ప్రకారం సింగిల్‌ షెడ్యూల్‌లో 35 రోజుల్లో పూర్తి చేసినట్లు యూనిట్‌ వర్గాలు వివరించాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఆనందకుమార్‌ ఛాయాగ్రహణను, విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top