
సాయిధరమ్ సుప్రీమ్
మెగాస్టార్ కాక ముందు చిరంజీవి ‘సుప్రీమ్’ హీరో. ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇదే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
మెగాస్టార్ కాక ముందు చిరంజీవి ‘సుప్రీమ్’ హీరో. ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇదే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘పటాస్’ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నందమూరి కల్యాణ్‌రామ్ కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నిచ్చారు.
హరీశ్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘ ‘పటాస్’ టైమ్‌లో అనిల్ నాకు ఓ స్టోరీ లైన్ చెప్పాడు. బాగా నచ్చింది. ఈ సినిమాతో తేజ్‌కు స్టార్ ఇమేజ్ వస్తుంది’’ అన్నారు. ‘‘యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ పుష్కలంగా ఉన్న సినిమా’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మెగా అభిమానులు సంతోషపడేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. అక్టోబర్ 5 నుంచి షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని తెలిపారు.