ఇపుడు నాన్న ఉంటే చాలా బావుండేది..
అద్భుతమైన నటనతో అటు బాలీవుడ్ని, ఇటు అమెరికా బుల్లి తెరను అలరిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాకం చోప్రా తన తండ్రిని బాగా మిస్పవుతోందట.
ముంబై: అద్భుతమైన నటనతో అటు బాలీవుడ్ని, ఇటు అమెరికా బుల్లి తెరను అలరిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన తండ్రిని బాగా మిస్పవుతోందట. అమెరికాలో తన డెబ్యూ టీవీ సీరియల్' క్వాంటికో ' తో దూసుకుపోతున్న పీసీ ఈ విజయాన్ని డాడీ చూస్తే బావుండేదని, ఆయన చాలా సంతోషించేవారని ఫీలవుతోంది. తాను డాడీని చాలా మిస్ అవుతున్నానంటూ ట్వీట్ చేసింది.
'నా విజయాలను చూసి నాన్న చాలా సంతోషించేవారు. ఆయన కళ్ళల్లో తొణికిసలాడే గర్వమే నన్నుఇంత ఎత్తుకు చేర్చింది. నా పరాజయాల్లో కూడా ఆయన కూడా తోడుగా ఉంటారనే ధీమా. ఒక వేళ నేను పడిపోయినా ఆయన కచ్చితంగా కాపాడుతారనే నమ్మకం నాలో భయాన్ని పొగొట్టిందం'టూ ట్వీట్ చేసింది. సంగీతమంటే మక్కువ తనకు తండ్రి నుంచే వచ్చిందని చెబుతోంది. తండ్రి మీద అభిమానానికి గుర్తుగా డాడీస్ లిల్ గర్ల్ అని టాటూ కూడా వేయించుకుంది.
మరోవైపు అమెరికాలో విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ క్వాంటికో టీవీ సీరియల్ అక్టోబర్ 3 నుండి మనదేశంలోని బుల్లితెరను కూడా ఏలుతోంది. ఎఫ్బీఐ ట్రైనీ ఆఫీసర్గా ప్రియాంక నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టెర్రరిస్టుల దాడిని ఛేదించే థ్రిల్లర్ కథాంశంతో రూపొందించిందే ఈ క్వాంటికో సీరియల్. కాగా ప్రియాంక తండ్రి అశోక్ చోప్రా క్యాన్సర్ తో రెండేళ్లు క్రితం చనిపోయిన విషయం తెలిసిందే.