శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో...

శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో... - Sakshi


నటి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో.. మాటల్లో చెప్పలేనంటున్నారు యువ నటి పూనంకౌర్. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం ఇలా దక్షిణాది భాషలన్నింటిలో నటిస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే హీరోయిన్‌గా తనకంటూ ఒక ఉన్నత స్థానం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్న ఈ అచ్చ తెలుగమ్మాయి త్వరలోనే తానాశించిన స్థాయికి రీచ్ అవుతాననే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చూడచక్కని సౌందర్యం, విశాల నయనాలు, ఆకర్షణీయ ముకారందం ఈ ముద్దుగుమ్మకు ప్లస్ పాయింట్స్. అలాంటి పూనం కౌర్‌తో సాక్షి ముచ్చట్లు..

 

ప్ర: సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది?

జ: నేను పుట్టింది, పెరిగింది, చదివింది హైదరాబాద్‌లోనే. ప్లస్-2 పూర్తి అవగానే ప్యాషన్ డిజైన్ రంగంపై ఆసక్తి కలిగింది. ఢిల్లీలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ చేరి ప్యాషన్ డిజైనర్ కోర్సు చేశాను. ఆ సమయంలోనే తెలుగు దర్శకుడు తేజ రూపొందిస్తున్న ఒక విచిత్రం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రంలో నటిస్తు న్న సమయంలోనే దర్శకుడు ఎస్‌వీ.రెడ్డి గారి నుంచి పిలుపొచ్చింది. ఆయన దర్శకత్వంలో నటించిన మాయాజాం నా తొలి చిత్రం. ఆ తరువాత నిక్కి అంటే నీరజ, శౌర్యం, గగనం మొదలైన చిత్రాల్లో నటించాను.

 

ప్ర: తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం భాషల్లోనూ నటిస్తున్నట్టున్నారు?

జ: తమిళంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన నెంజిరుక్కుంవరై చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యాను. ఆ తరువాత రణం, కమలహాసన్ నటించిన ఉన్నైప్పోల్ ఒరువన్, మలయాళంలో అవంభిక తదితర చిత్రాల్లో నటించాను.

 

ప్ర: ఇన్ని భాషల్లో నటించినా, హీరోయిన్‌గా మంచి స్థాయికి చేరుకోలేదే?

జ: అదే నాకు అర్థం కాని విషయం. బహుశా నేను ఎ లాంటిసినీ నేపథ్యం నుంచి రాకపోవడం కావచ్చు. సరైన గెడైన్స్ ఇచ్చే వారు లేకపోవడం ఒక కారణం కావచ్చు. అయినా కాస్త ఆలస్యంగానైనా నటిగా నా కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటా.ప్ర: ప్రస్తుతం తమిళంలోనే అవకాశాలు ఎక్కువగా వస్తున్నట్లున్నాయి?

జ: నిజమే. ఒక తెలుగు అమ్మాయిగా తెలుగులో అవకాశాలు అంతగా ఆశాజనకంగా లేకపోవడం చింతించే విషయమే. తెలుగు నటీమణుల్ని తెలుగు చిత్ర పరిశ్రమ గుర్తించడం లేదన్న బాధ కూడా ఉంది.

 

ప్ర: తమిళంలో చేస్తున్న చిత్రాలు?

జ: తమిళంలో అచ్చరం, వధం, ఎన్‌వళి తనీవళి మొదలగు చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటిలో ఎన్‌వళి తనీ వళి జనవరి 23న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో హీరోయిన్‌గా చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర పోషించాను. నటిగా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను.

 

ప్రశ్న: యాక్షన్ హీరోయిన్‌గా అవతారమెత్తారట?

జవాబు: అవును. వధం చిత్రంలో యాక్షన్ హీరోయిన్‌గా నటిస్తున్నాను. ఇది పూర్తిగా యాక్షన్ ఓరియంటెడ్ కథా చిత్రం. ఈ చిత్రం విజయంపై చాలా నమ్మకం ఉంది. చిత్రం విడుదలానంతరం తిరుపతి నుంచి కొండపైకి నడచి వచ్చి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్నాను.

 

ప్ర: సరే. గ్లామర్ విషయంలో మీ అభిప్రాయం?

జ: గ్లామర్ పాత్రల్లో నటించడానికి నేనెప్పుడూ కాదని చెప్పలేదు. అలాంటి పాత్రలు నాకు సరిగా అమరలేదంతే. ఎన్ వళి తనీ వళి చిత్రంలో ఒక పాటలో చాలా గ్లామర్‌గా నటించాను. ఆర్.కె హీరోగా నటించిన ఈ చి త్రానికి షాజి కైలాస్ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో నటించడం చాలా మంచి అనుభవం.

 

ప్ర: ఎలాంటి పాత్రలంటే ఇష్టం?

జ: ఒకటని కాదు. అన్ని రకాల పాత్రలు పోషించాలనుకుంటున్నా.

 

ప్ర: ఫలానా దర్శకుడితో నటించాలనే ఆశ ఉందా?

జ: రాఘవేంద్రరావు, రాజమౌళి లాంటి కమర్షియల్ దర్శకుల చిత్రాల్లో నటించాలని ఎవరి కుండదు చెప్పండి. అయితే కె.విశ్వనాథ్ గారి చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే వదలుకోను.

 

ప్ర: ఇష్టమైన నటుడు?

జ: తమిళంలో కమలహాసన్. ఆయన శ్రీదేవి నటించిన వసంతకోకిల ఎన్నిసార్లు చూశానో. ఆ చిత్రంలో శ్రీదేవి నటన అద్భుతం. అప్పటి నుంచి తానామెను మరచిపోలేకపోయాను. అభిమానం అనడం కంటే ఆమెను దేవతగా ఆదరిస్తాననడం కరెక్ట్‌గా ఉంటుంది. శ్రీదేవితో ఒక్క సన్నివేశంలో నైనా నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఇక తెలుగులో అయితే నటుడు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. ఆయన నట జీవితం నన్ను ఆశ్చర్యచకితురాలిని చేస్తోంది. నటిగా నాకు ఆయన స్ఫూర్తి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top