‘పీరియడ్స్‌’ డాక్యుమెం‍టరీకి దక్కిన అరుదైన గౌరవం

Oscars 2019 Period Get Oscar In Documentary Short Subject category - Sakshi

కోట్ల రూపాయల బడ్జెట్‌తో  చిత్రాలు తీసే భారతీయ దర్శకనిర్మాతలకు.. కథను పట్టించుకోకుండా కేవలం కండల ప్రదర్శన.. దుమ్ము రేపే విన్యాసాలను నమ్ముకునే హీరోలకు భారీ షాక్‌ తగిలింది. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలంటేనే అదోలా మొహం పెట్టే వారి దిమ్మతిరిగి పోయే విచిత్రం ఒకటి ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమలో చోటు చేసుకుంది. స్త్రీ జీవితంలో ప్రధాన పరిణామమైన రుతుచక్రం ఇతివృత్తంతో రూపొందిన ‘పీరియడ్ : ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌’ డాక్యూమెంటరీకి ఆస్కార్‌ అవార్డ్‌ లభించింది. ప్రముఖ నిర్మాత గునీత్‌ మోంగా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న రుతుక్రమ సమస్యల నేపథ్యంలో నిర్మించిన డాక్యుమెంటరీ ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. రేకా జెహ్‌తాబ్చి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

పీరియడ్స్‌ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలను.. వాటి పట్ల జనాలకున్న అపోహలను.. సమాజం తీరును ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఆస్కార్‌ అవార్డును అందుకున్న సందర్భంగా రేకా స్టేజ్‌పై ప్రసంగిస్తూ.. ‘ఓ మై గాడ్‌. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య గురించి నేను డాక్యుమెంటరీ తీస్తే దానికి ఆస్కార్ వచ్చింది. నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ‘మేము గెలిచాం. భూమ్మీద ఉన్న అమ్మాయిలందరు దేవతలు. ఇప్పుడు ఈ మాటని స్వర్గం కూడా వింటుంద’ని గునీత్‌ మోంగా ట్వీట్‌ చేశారు.

అయితే ఇప్పటివరకు ఎన్నో భారతీయ చిత్రాలు ఆస్కార్‌కు నామినేట్‌ అయినప్పటికీ.. అవార్డుల విషయానికి వచ్చేసరికి నిరాశే మిగిలింది. అలాంటిది ఓ డాక్యుమెంటరీ.. అందునా స్త్రీ సమస్య ఇతివృత్తంగా తెరకెకిక్కన చిత్రం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గెలిచి చరిత్ర సృష్టించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top