విదేశాల్లోని పురాతన వస్తువుల రికవరీ
ఇటీవలి కాలంలో వేగం పెంచిన భారత్
1947–2014 మధ్య వచ్చినవి కేవలం 13
2020–24లో 610 వస్తువులు స్వాధీనం
ఇతర దేశాల్లో ఉండిపోయిన మన పురాతన వస్తువులను రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది. వివిధ దేశాలకు తరలి వెళ్లిన ఈ అపురూప కళాఖండాలను.. సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి పొందడం, జాతీయ గౌరవాన్ని పునరుద్ధరించడం లక్ష్యంగా తిరిగి సొంతం చేసుకుంటోంది. వీటిని సంరక్షించడం, అధ్యయనం కోసం అందుబాటులో ఉండేలా చూడటం కూడా ఈ ప్రయత్నాల ముఖ్య ఉద్దేశం.
⇒ సీతా రామ లక్ష్మణుల లోహ విగ్రహాలను 2020లో యూకే నుంచి తెప్పించగలిగాం.
⇒ సంతానలక్ష్మి విగ్రహం... 2021లో అమెరికా నుంచి తిరిగి రప్పించగలిగాం.
⇒ మహిషాసుర మర్దిని విగ్రహాన్ని 2022లో ఆస్ట్రేలియా నుంచి తీసుకురాగలిగాం.
⇒ సూర్య భగవానుడి రాతి శిల్పాన్ని 2023లో యూకే నుంచి సాధించుకున్నాం.
13 మాత్రమే..
2021 అక్టోబరులో అమెరికా సుమారు 15 మిలియన్ డాలర్ల విలువైన 248 అపురూప దేవీ దేవతా విగ్రహాలు, పురాతన వస్తువులను మనదేశానికి అప్పగించింది. ‘ప్రపంచంలోని ఏ మ్యూజియం కూడా అనైతికంగా సంపాదించిన ఏ కళాకృతిని కలిగి ఉండకూడదు. స్వాతంత్య్రానికి ముందు, తరువాత విగ్రహాలను మన దేశం నుంచి అనైతిక రీతిలో బయటకు తీసుకెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతి పెరుగుతున్నందున వివిధ దేశాలు మన వారసత్వాన్ని తిరిగి ఇవ్వడం ప్రారంభించాయి’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యల ఫలితంగా ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, థాయ్‌లాండ్, యూకే, యూఎస్‌ఏ నుంచి భారీ ఎత్తున పురాతన వస్తువులను స్వాధీనం చేసుకుంది. 2014 నుంచి ఇప్పటివరకు మొత్తం 640 పురాతన వస్తువులు భారత్‌కు తిరిగి వచ్చాయి. 1947 నుంచి 2014 మధ్య కేవలం 13 పురాతన వస్తువులను మాత్రమే మన దేశం స్వాధీనం చేసుకోగలిగింది.
⇒ ఇలా.. 2020–24 మధ్య 610 పురాతన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో అమెరికా నుంచి వెనక్కి వచ్చినవే ఎక్కువ కావడం గమనార్హం. సగం వస్తువులను దౌత్య మార్గాల ద్వారా భారత్ తిరిగి అందుకుంది. ఈ భారతీయ కళాఖండాలు, వాటి పునరుద్ధరణ గురించి అవగాహన పెంచడానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు, ప్రదర్శనలు, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. భారత పురావస్తు శాఖ తన అధికార పరిధిలోని రక్షిత స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, మ్యూజియాలలో దొంగతనానికి గురైన వస్తువుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తోంది.

సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి పొందడం
వలసవాద కాలంలో భారత్ నుంచి అనేక కళాఖండాలు తరలిపోయాయి. తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియాలు, ప్రైవేట్ సేకరణ సంస్థలకు విక్రయం లేదా బహుమతిగా చేరాయి. ఈ వస్తువులను తిరిగి పొందడం జాతీయ గుర్తింపు, గౌరవంగా భారత్ భావిస్తోంది. అలాగే వలసవాద పాలనలో భారతీయ కళాఖండాలను క్రమబద్ధంగా దోచుకోవడం దేశ చరిత్రపై ఒక మచ్చను మిగిల్చింది. ఈ వస్తువులను తిరిగి పొందడం చారిత్రక అన్యాయాలను సరిదిద్దడానికి, ఎదుర్కొన్న సాంస్కృతిక నష్టాలను గుర్తించడానికి సహాయపడుతుంది.
అక్రమ రవాణాను అరికట్టడం
పురాతన వస్తువుల అక్రమ వ్యాపారాన్ని కొందరు లాభదాయకంగా మల్చుకున్నారు. దొంగిలించిన కళాఖండాలను తిరిగి పొందడం, చట్టపరమైన చట్రాలను బలోపేతం చేయడం ద్వారా భారత్ ఈ వ్యాపారంపై ఉక్కుపాదం మోపేందుకు చురుకుగా పనిచేస్తోంది.
సంరక్షణ–పరిశోధన
రికవరీ తరువాత ఈ కళాఖండాలను మ్యూజియాలు, ఇతర సంస్థలలో భద్రపరుస్తున్నారు. అక్కడ వాటిని సంరక్షణ, అధ్యయనంతోపాటు ప్రజల సందర్శన కోసం అందుబాటులో ఉంచుతున్నారు.
అంతర్జాతీయ సహకారం
దొంగతనానికి గురైన కళాఖండాలను దౌత్య మార్గాలు, ఒప్పందాల ద్వారా స్వదేశానికి తిరిగి రప్పించడానికి భారత్ ఇతర దేశాలతో, ముఖ్యంగా అమెరికాతో చురుగ్గా వ్యవహరిస్తోంది.