ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌; ఎలా ఉంటుంది?

Oscars 2018 Best Movie The Shape of Water Review - Sakshi

తెరపై దర్శకుడు కథ చెప్పే తీరును బట్టి ఆయా పాత్రలతో మనం మమేకమవుతుండటం సహజం. ఆ కథానేపథ్యం.. మనిషిలోని క్రూరస్వభావానికి, వింతజీవుల అమాయకత్వానికి మధ్య కొనసాగే వైరమైతే.. మనం ఎవరిపక్షాన నిలబడతాం? ‘అవతార్‌’లో నావీలే గెలవాలని, ‘ఈగ’ లో సినిమాలోనూ ఈగే గెలవాలని ప్రేక్షకులు బలంగా కోరుకునేలాచేయడం గొప్ప సినిమాటిక్‌ టెక్నీక్‌.

సరిగ్గా ఇదే టెక్నీక్‌ను అనుసరించి అటు కమర్షియల్‌గా, ఇటు అవార్డుల పరంగా అనూహ్యవిజయం సాధించాడు హాలీవుడ్‌ డైరెక్టర్‌ గిలెర్మో డెల్‌ టోరో. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఫ్యాంటసీ డ్రామా ‘ది షేప్ ఆఫ్‌ వాటర్‌’  ఆస్కార్‌-2018 ఉత్తమ చిత్రం పురస్కారాన్ని గెలుచుకుంది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 90వ అకాడమీ అవార్డు వేడుకలు ఆదివారం రాత్రి(స్థానిక కాలమానం ప్రకారం) అట్టహాసంగా జరిగాయి. ఉత్తమ చిత్రంతోపాటు ఉత్తమ దర్శకుడు, ప్రొడక్షన్‌ డిజైన్‌, ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాల్లో నాలుగు ఆస్కార్లను గెలుచుకుంది.

ఇదీ కథ..  : అమెరికా-రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న రోజుల్లో ఇరుదేశాలూ అంతరీక్షంలో సైతం పోట్లాడుకునే సందర్భమది. అప్పటికే రష్యా ఓ కుక్క(లైకా)ను స్పేస్‌లోకి పంపించిన విజయోత్సాహంలో ఉంటుంది. ఎలాగైనాసరే, వాళ్లకంటే గొప్ప ప్రయోగం చేసితీరాల్సిందేనని అమెరికా భావిస్తుంది. ఇందుకోసం బాల్టిమోర్‌(మేరీలాండ్‌)లోని ఓ రహస్య ప్రదేశంలో ప్రయోగాలు నిర్వహిస్తూఉంటుంది. ఆ ల్యాబ్‌లో హౌస్‌కీపింగ్‌ క్లీనర్స్‌లో ఓ మూగ యువతి ఉంటుంది. పేరు ఎలీసా ఎపోసిటో (సాలీ హాకిన్స్‌ పోషించారీ పాత్ర). తల్లిదండ్రులు ఎవరో తెలీని అనాథ. నదిలో కొట్టుకొచ్చిన ఆమెను రెస్క్యూహోం వాళ్లు చేరదీసిస్తారు. మాటలు రాకున్నా అద్భుతమైన ప్రజ్ఞ ఆమె సొంతం. సైగల భాషలో దిట్ట. అయితే తన మెడ భాగంలో ఏర్పడ్డ చారల గురించి నిత్యం మధనపడిపోతుంది.

పక్క ఫ్లాట్‌లో నివసించే గిలే (మలివయ చిత్రకారుడైన గే పాత్ర ఇది), పని ప్రదేశంలో తోటి వర్కర్‌ జెల్డా (ఆక్టావియా స్పెన్సర్‌)లు ఇద్దరితో మాత్రమే ఎలీసా స్నేహంగా మెలుగుతూ ఉంటుంది. ఒకరోజు.. రహస్య ల్యాబ్‌ ఇన్‌చార్జి కల్నల్‌ రిచర్డ(మిచెల్ షానాన్‌)  ఓ విచిత్రజీవిని బంధించి తీసుకొస్తాడు. అది మానవరూపంలో కనిపించే ఉభయచరం. దానికి శిక్షణ ఇచ్చి, అంతరీక్షంలోకి పంపాలన్నది ప్లాన్‌. అయితే ఆ హ్యూమనాయిడ్‌ క్రియేచర్‌ ఎంతకీ మాట వినకపోవడంతో క్రూరంగా వ్యవహరిస్తాడు కల్నల్‌. ఆ జీవిని బంధించిన గదిని శుభ్రం చేసేబాధ్యత ఎలీసాది. అలా ప్రతిరోజూ హ్యూమనాయిడ్‌ వద్దకెళ్లే ఆమె.. క్రమంగా దానితో స్నేహం పెంచుకుంటుంది. తనలాగే అనాధలాపడిఉన్న జీవిని మనసారా ప్రేమిస్తుంది.

.
శారీరకంగానూ ఒక్కటవుతారు: ఇదిక అంతరిక్ష ప్రయోగాలకు పనిరాదని నిర్ధారించుకున్న పిదప హ్యూమనాయిడ్‌ను చంపిపారేయాలనే నిర్ధారణకు వస్తారు. కల్నక్‌కు అసిస్టెంట్‌గా వ్యవహరించే డాక్టర్‌ రాబర్ట్‌ మాత్రం దాన్నలా బతికేఉంచి వేరే ప్రయోగాలు చేద్దామంటాడు. ఈ విఫలయత్నం బయటికి పొక్కితే అమెరికా పరువు పోతుందనే ఉన్నతాధికారులు సైతం చంపడానికే సయ్యంటారు. వాళ్ల సంభాషణను రహస్యంగా విన్న ఎలీసా.. ఎలాగైనాసరే ఆ జీవిని కాపాడాలనుకుంటుంది. ల్యాబ్‌లో అందరి కళ్లుగప్పి హ్యూమనాయిడ్‌ను తనతో తీసుకెళుతుంది. ఇంటికి దగ్గర్లోని నదీపాయలోకి నీళ్లు విడుదలయ్యే రోజున.. ఆ జీవిని వదిలిపెట్టాలని నిర్ణయించుకుంటుంది ఎలీసా. జీవిని ల్యాబ్‌ నుంచి తీసుకొచ్చే ప్లాన్‌కు మొదట నిరాకరించినా ఆతర్వాత సాయం చేసేందుకు స్నేహితులిద్దరూ అంగీకరిస్తారు. డాక్టర్‌ రాబర్ట్‌కూడా సహకరిస్తాడు. తన ఫ్లాట్‌లోని బాత్‌రూమ్‌లో.. ఉప్పునీళ్లతో నిండిన బాత్‌టబ్‌లో ఎలీసా, హ్యూమనాయిడ్‌లు ఇద్దరూ కలసి ఆటలాడుతూ, ప్రేమ సైగలు చేసుకుంటూ, శారీరకంగానూ ఒక్కటవుతారు.


ఆమె మెడపై చారల రహస్యం : ఒక వర్షాకాలపు రాత్రి వింతజీవిని వదిలేసే సమయం ఆసన్నమవుతుంది. గిలే వెంటరాగా, హ్యూమనాయిడ్‌ను తీసుకుని కెనాల్‌ వద్దకొస్తుంది ఎలీసా. ఈ లోపే కల్నల్‌ రిచర్డ్‌ అక్కడికి వస్తాడు. హ్యూమనాయిడ్‌ను దొంగిలించడమేకాక, అధికారులతో తిట్లుతినడానికి కారకురాలైన ఎలీసాపై ఆగ్రహంతో రగిలిపోతాడు. తుపాకి తీసి హ్యూమనాయిడ్‌తోపాటు ఎలీసాను, వృధ్ధుడైన గిలేను కాల్చేస్తాడు. తనకున్న దివ్య శక్తితో బుల్లెట్‌ గాయం నుంచి క్షణాల్లో కోలుకుంటుందా జీవి. పట్టరాని కోపంలో తన పదునైన గోర్లను ఉపయోగించి రిచర్డ్‌ పీకను తెగ్గోసి చంపేస్తుంది. బుల్లెట్‌ దెబ్బతిన్న గిలేనూ దివ్యశక్తితో బతికిస్తుంది. ఈలోపే పోలీసులు అక్కడికి రావడంతో ఎలీసాను ఎత్తుకుని నీళ్లలోకి దూకేస్తుంది. నీళ్లలో ఊపిరాడక కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఎలీసాను కూడా దివ్యశక్తితో బతికించుకుంటుంది. అప్పుడు ఎలీసా మెడపైనున్న చారలు.. మొప్పలుగా మారి శ్వాస తీసుకుంటాయి. ‘ఆ విధంగా నీటి అడుగుభాగాన ఆ ప్రేమ జీవులు హాయిగా జీవించసాగాయి.. ’ అనే అర్థంలో ‘షేప్‌ ఆఫ్‌ వాటర్‌’ స్వరూపాన్ని వివరిస్తుండగా కథ ముగుస్తుంది.

ఎలా ఉంది? : శబ్ధం చెయ్యకుండా ఎలీసా పాత్రలో నవరసాలను ఒలికించిన సాలీ హాకిన్స నటన మహాద్భుతంగా ఉంటుంది. ఆస్కార్‌ ఉత్తమ నటి అవార్డు మిస్సైనప్పికీ హాకిన్స​ ఇప్పటికే ఈ పాత్రకుగానూ  లెక్కకుమిక్కిలి పురస్కారాలు అందుకుంది. సినిమా ప్రారంభం నుంచి ఎలీసాలో ఏదో తెలియని వింతగుణం ఉందనే భావనను దర్శకుడు చాలా బాగా ఎలివేట్‌ చేస్తాడు. ఒకదశలో ‘మనిషిగా ఉంటూ ఇంత ఇల్లాజికల్‌గా ఆలోచిస్తున్నావేంటి? అని స్నేహితులు ఎలీసాను ప్రశ్నిస్తారు. అలా చివరికి ఆమె కూడా హ్యూమనాయిడ్‌లా మారిపోవడాన్ని ప్రేక్షకులు అంగీకరించేలా పాత్రను అర్థవంతంగా చిత్రీకరించాడు దర్శకుడు టొరో. కోల్డ్‌వార్‌ నేపథ్యం తన కథకు మరింత బలాన్నిచ్చిందన్న దర్శకుడి మాటలు ఎంత నిజమో సినిమా చూసిన ప్రతిఒక్కరికీ అర్థమవుతుంది.

ఫాక్స్‌ సెర్చింగ్‌ పిచ్చర్స్‌ డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న ఈ సినిమా 2017 ఆగస్టులో వెనీస్‌లోనూ, 2017 డిసెంబర్‌లో యూఎస్‌లోనూ విడుదలైంది. నిడివి 123 నిమిషాలు. 19.5 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘షేప్‌’.. బాక్సాఫీస్‌ వద్ద 126.4 మిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top