
‘వెన్నెల’ పోగ్రాం ఫేమ్ జయతి గడ్డం లీడ్ రోల్‌లో నటించి, నిర్మించిన చిత్రం ‘లచ్చి’. చంద్రమోహన్, రఘుబాబు, ధనరాజ్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఈశ్వర్ దర్శకుడు. ఈ నెల 24న ‘లచ్చి’ విడుదల కానుంది. జయతి మాట్లాడుతూ– ‘‘ఈశ్వర్‌గారు పవన్‌కల్యాణ్‌గారి వద్ద డైరెక్షన్ టీంలో వర్క్ చేశారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో సినిమా నిర్మించాలనుకున్నా. అయితే... ముందు నటించాలనుకోలేదు. పాత్ర చాలా డీసెంట్‌గా, నాకు సరిపోయేలా ఉందనిపించి నటించా. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరించాం. ఆత్మలను పట్టే దేవి అనే అమ్మాయి ఓ ఊరి సమస్యను ఎలా పరిష్కరించిందన్నదే కథ. లచ్చి పాత్రలో మరో అమ్మాయి కనిపిస్తుంది.
ఆ లచ్చి ఏమైందో తెలుసుకునే దిశగా దేవి పాత్ర సాగుతుంది. గతంలో ఎంత మంది మహిళా నిర్మాతలు వచ్చారో నాకు తెలియదు. కానీ, నేను చాలా ఇష్టపడి ఈ సినిమా కోసం కష్టపడ్డా. మంచి అవుట్ రావాలని బాగా టెన్షన్ పడ్డాను. ఫస్ట్ కాపీ చూశాక హ్యాపీ. ఎం.వి. రఘుగారు ప్రతి సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించారు. సురేశ్ యువన్ మంచి పాటలిచ్చారు. ఈ సినిమా హిట్టయితే మలయాళ ‘మై బాస్’ రీమేక్ చేస్తా. దర్శకత్వం చాలా కష్టం. ఆ ఆలోచనే లేదు. గ్లామర్ పాత్రల్లో నటించలేను. నాకు తగ్గ పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తా’’ అన్నారు.