ఇకనుంచి నా ఫ్యాన్స్‌కీ అది మ్యాజికల్‌ డేట్‌ అవుతుంది

Mahesh Babu interview about Maharshi - Sakshi

20 ఏళ్లు.. 25 సినిమాలు. హీరోగా మహేశ్‌బాబు జర్నీ ఇది. ఈ జర్నీలో మహేశ్‌ ఎప్పటికీ మరచిపోలేని తీయని జ్ఞాపకం ఒకటి ఉంది. ఆ విషయంతో పాటు మహేశ్‌బాబు ఇంకా చాలా విశేషాలు చెప్పారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్‌’రాజు, పీవీపీ నిర్మించిన ‘మహర్షి’ ఈ నెల 9న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు చెప్పిన విశేషాలు.

► మహర్షి’ సినిమా చేయడానికి కారణం?
కథ విని, చాలా ఎగై్జట్‌ అయ్యాను. సినిమాలో కాలేజ్‌ ఎపిసోడ్‌ చాలా ఇంపార్టెంట్‌ అని,  కాన్ఫిడెంట్‌గా చేద్దాం అని వంశీ పైడిపల్లితో చెప్పాను. ఎందుకంటే హీరోగా 20 ఏళ్లు పూర్తయింది. 25 సినిమాలు చేశాను. ఇప్పుడు మళ్లీ కాలేజ్‌ స్టూడెంట్‌ అంటే నమ్మేలా ఉండాలి. ఆ ఎపిసోడ్‌ దాదాపు 45 నిమిషాలు ఉంటుంది. అందుకే దాన్ని మేం బాగా డీల్‌ చేశాం. సినిమాలో అది నా ఫెవరెట్‌ పోర్షన్‌. సినిమా చూస్తున్నప్పుడు గర్వంగా ఫీల్‌ అయ్యాను. ఆడియన్స్‌కు కూడా తప్పకుండా నచ్చుతుంది.

► వంశీ ఈ కథతో మీ కోసం రెండేళ్లు వెయిట్‌ చేయడం గురించి?
నిజానికి ఓ 20 నిమిషాలు కథ విని వంశీని పంపించేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఆ టైమ్‌లో నాకు చాలా కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. దాదాపు 40 నిమిషాలు కథ చెప్పాడు. బాగా నచ్చింది. ముందు ఇచ్చిన కమిట్‌మెంట్స్‌ పూర్తి చేసిన తర్వాతే మీ సినిమా ఉంటుంది అని చెప్పాను. ‘పర్లేదు. వెయిట్‌ చేస్తాను. ఆ వెయిటింగ్‌ గ్యాప్‌లో కథకు ఇంకా మెరుగులు దిద్దుతాను’ అని చెప్పాడు. మీరు తప్ప ఈ సినిమాలో హీరోగా ఎవరూ కనిపించడం లేదు అన్నాడు. వంశీ కన్విక్షన్‌కు హ్యాట్సాఫ్‌. అతనితో వర్క్‌ చేయడం హ్యాపీగా ఫీల్‌ అవుతున్నాను.

► 25వ సినిమా ‘మహర్షి’ అని ముందే ప్లాన్‌ చేశారా?
నేను చేయాల్సిన సినిమాలు ఉండటం. వంశీ వెయిట్‌ చేయడం. ఇలా అన్నీ కలిసి ‘మహర్షి’ నా కెరీర్‌లో 25వ సినిమా అయింది. 25వ సినిమాగా ఇదే చేయాలని ప్లాన్‌ చేసి చేయలేదు. ‘మహర్షి’లో మంచి డెప్త్‌ ఉంది. ఈ మధ్య కాలంలో ఆడియన్స్‌ ఇలాంటి సినిమాను చూసి ఉండరు. ఫ్యామిలీ ఎమోషన్స్, క్లాస్, మాస్, యూత్‌.. హీరో ఫ్యాన్స్‌.. ఇలా అన్ని యాంగిల్స్‌ని కవర్‌ చేశాడు వంశీ.

► ఈ మధ్య మీరు సోషల్‌ మేసేజ్‌ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది?
అదేం కాదు. ‘శ్రీమంతుడు, భరత్‌ అనే నేను’ సినిమాల్లో మంచి మెసేజ్‌ ఉంది. అలాంటి సినిమాల్లో నటించడం నాకు హ్యాపీగా ఉంది. అలాగే ‘మహర్షి’ సినిమాలో కూడా ఓ పవర్‌ఫుల్‌ పాయింట్‌ ఉంది. అది ఇప్పుడే చెప్పి ప్రేక్షకుల ఎగై్జట్‌మెంట్‌ తగ్గించేయను.

► ‘శ్రీమంతుడు’ సినిమాలో దత్తత అనే పాయింట్‌ ఉంది. ఇందులోనూ అలాంటి పాయింట్‌ ఏదైనా?
ఉంటుంది. ఓ పవర్‌ఫుల్‌ పాయింట్‌ను టచ్‌ చేశాం. సినిమా రిలీజ్‌ రోజున ఆడియన్స్‌ ఎగై్జట్‌ అవుతారని అనుకుంటున్నాం. ఆ పాయింట్‌ రైతుల సమస్యల గురించా? అనే విషయం ఇప్పుడే చెప్పలేను. థియేటర్స్‌లో చూడాల్సిందే.

► ఈ సినిమాలో మూడు లుక్స్‌లో కనిపిస్తున్నారు. మీ ఫేవరెట్‌ లుక్‌ ఏది?
ఇంతకు ముందు ఒకే లుక్‌లో సినిమాలు చేస్తున్నానని అన్నారు. ఈ సినిమాలో మూడు లుక్స్‌ ఉంటాయి. స్టూడెంట్‌లా, రైతులా, బిజినెస్‌మన్‌లా కనిపిస్తాను. ఏ లుక్‌ ట్రై చేసినా అది ఆ సినిమా, అందులో క్యారెక్టర్‌ ప్రకారమే ఉంటుంది. అలాగే లుక్‌ మార్చడమంటే హెయిర్‌ స్టయిల్‌ మార్చడం, గడ్డం పెంచడం తప్ప కొత్తగా ఏమీ ఉండదు (నవ్వుతూ).

► ఇది మల్టీ ప్రొడ్యూసర్స్‌ సినిమా.. అనుకున్న బడ్జెట్‌ కన్నా కాస్త ఎక్కువైనట్లుంది?
అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీగారికి ముగ్గురూ నిర్మించారు. ‘మహర్షి’ చాలా పెద్ద స్కేల్‌ సినిమా. ఇంత బాగా రావడానికి వాళ్ల ముగ్గురి సపోర్ట్‌ చాలా ఉంది. సినిమాలో హీరో న్యూయార్క్‌లో సీఈవో. అంటే కార్లు, హెలికాప్టర్‌లు కావాలి. అప్పుడు అనుకున్నదానికంటే ఖర్చు ఎక్కువ అయ్యింది. ప్రొడ్యూసర్స్‌ బాగా సపోర్ట్‌ చేశారు. కొన్ని కీలక సన్నివేశాలను విలేజ్‌లో షూట్‌ చేద్దాం అనుకున్నాం. కుదర్లేదు. సెట్‌ వేశాం. ఆ సీన్స్‌లో ప్రతిరోజూ దాదాపు వెయ్యిమంది జూనియర్‌ ఆర్టిస్టులు కావాల్సి వచ్చింది. డిసెంబర్‌లో షూట్‌ చేశాం. 5 గంటలకు సూర్యుడు వెళ్లిపోతాడు. లైట్‌ ఫెయిల్‌ అవుతుంది. ఆ షెడ్యూల్‌ మరో పది రోజులు పెరిగింది.  ఇలాంటి కారణాలు ఉన్నాయి.

► ఇక మీ నుంచి ఏడాదికి కనీసం  రెండు సినిమాలు అశించవచ్చా?
ఈ రోజుల్లో సినిమా అనేది టఫ్‌ టాస్క్‌ అయిపోయింది. నాన్నగారి టైమ్‌లో 300– 350 సినిమాలు వరకూ చేశారు. ఇప్పుడు 25వ సినిమానే పెద్ద ల్యాండ్‌మార్క్‌ ఫిల్మ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం. మరో విషయమేటంటే పెద్ద సినిమా చేయాలంటే కనీసం 8 నుంచి 10 నెలలు సమయం పడుతుంది. ఒక పర్‌ఫెక్ట్‌ ప్రొడక్ట్‌ ఇవ్వడానికి అంత సమయం పడుతుంది.  పెద్ద సినిమా షూటింగ్‌ అంటే అన్ని పనులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పెద్ద సినిమా ఐదారు నెలల్లో వస్తే అద్భుతమే. ‘భరత్‌ అనే నేను’ తర్వాత నెల రోజుల కంటే ఎక్కువ టైమ్‌ తీసుకోలేదు నేను. వెంటనే ‘మహర్షి’ స్టార్ట్‌ చేశాం.

► వంశీతో వర్క్‌ంగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
వంశీ కథ ఎలా చెప్పాడో అలానే తీశాడు. కథను చాలా క్లారిటీగా కమ్యూనికేట్‌ చేస్తాడు. అది నా పెర్ఫార్మెన్స్‌ అయినా కూడా కావొచ్చు. బాగా చేశాడు. సినిమా రిలీజైన తర్వాత వంశీకే పేరు వస్తుంది. అంత బాగా తీశాడు. చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీశాడు. ఈ కథను రెండేళ్లు రాశాడు. స్క్రిప్ట్‌పై ఎంత టైమ్‌ స్పెండ్‌ చేస్తే అవుట్‌పుట్‌ అంత బాగా వస్తుంది అంటాం. ఈ సినిమాకు అలా జరిగింది.

► 20 ఏళ్ల జర్నీ గురించి ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో కొందరు దర్శకులకు థ్యాంక్స్‌ చెప్పి, కొందరు దర్శకుల పేర్లు ప్రస్తావించకపోవడానికి కారణం?
ఆ ఈవెంట్‌కు వచ్చే ముందు దాదాపు 16 గంటలు ప్రయాణం చేసి యూరప్‌ నుంచి వచ్చాను. స్టేజ్‌ మీద నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్‌ వచ్చారు. ఆ హడావిడిలో మర్చిపోయాను. అది నా మిస్టేక్‌. దర్శకుడు పూరి జగన్నాథ్‌కు థ్యాంక్స్‌. ‘పోకిరి’ నన్ను సూపర్‌స్టార్‌ని చేసిన ఫిల్మ్‌. అలాగే దర్శకుడు సుకుమార్‌గారికి థ్యాంక్స్‌. ‘1: నేనొక్కడినే’ క్లాసిక్‌ కల్ట్‌ సినిమా నా కెరీర్‌లో. వన్నాఫ్‌ మై ఫెవరేట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌.

► అలాగే కొందరు దర్శకులు కథ రెడీ చేసుకున్నాక వెయిట్‌ చేయలేకపోతున్నారు అనే కామెంట్‌ కూడా చేశారు?
వంశీ రెండేళ్లు వెయిట్‌ చేశాడని అతన్ని అభినందించడానికి, పొగడటానికి అన్న మాట అది. సుకుమారుగారి గురించి కామెంట్‌ చేశాననట్లు రాశారు. సుకుమార్‌గారిని పాయింట్‌ అవుట్‌ చేసి అన్నది కాదు. సుకుమార్‌గారు నాకు స్పెషల్‌ డైరెక్టర్‌. భవిష్యత్‌లో మేం కచ్చితంగా కలిసి సినిమా చేస్తాం.

► హిట్టయిన డైరెక్టర్స్‌ పేర్లు మాత్రమే ప్రీ–రిలీజ్‌ వేడుకలో చెప్పారనే విమర్శ ఉంది..
సక్సెస్‌.. ఫెయిల్యూర్‌ అని కాదు. నా కెరీర్‌ గ్రాఫ్‌లో ఈ దర్శకుల సినిమాలు చాలా కీలకం. అందుకే వాళ్ల పేర్లు చెప్పాను. ‘మురారి’ అనే సినిమా నటుడిగా నాకు చాలా క్రూషియల్‌. మహేశ్‌ యాక్ట్‌ చేయగలడు అని చెప్పిన సినిమా అది. ‘ఒక్కడు’ నన్ను స్టార్‌ని చేసింది. ‘అతడు’ సినిమా నాకు యూఎస్‌లో మార్కెట్‌ని ఓపెన్‌ చేసింది. ‘పోకిరి’ సినిమా తర్వాత సూపర్‌స్టార్‌ అన్నారు. ఇవన్నీ నాకు ముఖ్యమైన సినిమాలు. ఇప్పుడు నా జర్నీలో ‘మహర్షి’ 25వ సినిమా. అంతేకానీ హిటై్టన డైరెక్టర్స్‌ పేర్లు చెప్పడమే అని కాదు.

► ‘శ్రీమంతుడు’ సినిమాతో ‘మహర్షి’కి పోలికలు ఉన్నాయి అంటున్నారు?
ఈ సినిమాకు, ‘శ్రీమంతుడు’ సినిమాతో సంబంధం లేదు. సినిమా చూస్తే తెలుస్తుంది. టీజర్‌ అప్పుడు పోల్చి చూశారేమో..  ట్రైలర్‌ వచ్చిన తర్వాత అలాంటి కామెంట్స్‌ ఏం వినబడలేదు.

► 25 సినిమాలు చేశారు. మీ కెరీర్‌లో మోస్ట్‌ మెమొరబుల్‌ మూమెంట్‌ అంటే ఏది చెప్తారు?
నాన్నగారితో ‘మురారి’ మార్నింగ్‌ షో సినిమా చూశాను. అది కూడా హైదరాబాద్‌ సుదర్శన్‌ థియేటర్‌లో. ‘మురారి’ సినిమా క్లైమాక్స్‌ తర్వాత నా భుజంపై నాన్నగారు చేయి పెట్టారు. అదే నా మోస్ట్‌ మెమొరబుల్‌ మూమెంట్‌. సినిమా బాగుందా? బాలేదా? అలా ఏం చెప్పలేదు. భుజంపై చేయి వేసి అలా తడిమారు.. అంతే. ‘మహర్షి’ సినిమా గురించి నాన్నగారు ఏం చెబుతారో అని ఇంట్రెస్ట్‌గా వెయిట్‌ చేస్తున్నాను.

► మే 9న చాలా సెంటిమెంట్స్‌ ఉన్నాయి?
మే 9 నిజంగా మ్యాజికల్‌ డేట్‌.  అశ్వనీదత్‌ గారికి రెండు బ్లాక్‌బస్టర్‌ సినిమా (జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి)లు ఉన్నాయి. ఇక నుంచి మా అభిమానులకు కూడా ఆ డేట్‌ మ్యాజికల్‌గా మారబోతోంది.

► బౌండ్‌ స్క్రిప్ట్‌ ఉంటేనే సినిమాలు అంగీకరిస్తాను అంటున్నారు..
బ్రౌండ్‌ స్క్రిప్ట్‌  ముఖ్యం. అరగంట కథ విని ఎగై్జట్‌ అవ్వడం కన్నా మూడు గంటలు స్క్రిప్ట్‌ విని చేయడం మంచిది. షూటింగ్‌లోకి దిగిన తర్వాత స్క్రిప్ట్‌ గురించి మళ్లీ డిస్కషన్స్‌ ఉండకూడదని నా ఫీలింగ్‌. నేను గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నాను. ‘స్పైడర్, బ్రహ్మోత్సవం’ సినిమాలు 20 నిమిషాల నరేషన్‌ విన్నప్పుడు ఎగై్జట్‌ అయ్యాను. సేమ్‌ టైమ్‌ షూటింగ్‌లో దిగినప్పుడే నాకు తెలిసిపోయింది. మన లోపల ఉన్న భయం చెప్పేస్తుంది. ఆ తప్పులు మళ్లీ రిపీట్‌ చేయకూడదు అనుకుంటున్నాను. ఇక మీదట డిటైల్డ్‌ స్క్రిప్ట్‌ ఉండి.. కథ నచ్చితేనే  సినిమా చేస్తాను.

► బోయపాటి శ్రీను, త్రివిక్రమ్, రాజమౌళిలతో మీరు సినిమాలు చేయాల్సి ఉందేమో?
రాజమౌళిగారు, నేను ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. కేఎల్‌ నారాయణగారు నిర్మాత. నా కమిట్‌మెంట్స్, ఆయన కమిట్‌మెంట్స్‌ పూర్తయినప్పుడు మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది. త్రివిక్రమ్‌గారితో కూడా చర్చలు జరుగుతున్నాయి.

► హిస్టారికల్‌ సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్‌ ఉందా?
హిస్టారికల్‌ సినిమాలు చేయాలంటే నాకు భయం. రాజమౌళిగారిలాంటి దర్శకులు కన్విన్స్‌ చేసినప్పుడు చేస్తాను.

► అడవి శేష్‌తో ఓ సినిమా ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. ఆ సినిమా గురించి?
అడవి శేష్‌ ‘గూఢచారి’ సినిమా చూశాను. నచ్చింది. అలాంటి ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనుకున్నాం. సోనీ పిక్చర్స్‌వారు కలసి పని చేద్దాం అని వచ్చారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తాం. నాకు నచ్చిన అన్ని కథలను నేను చేయలేను. వీలైతో వాటిలో కొన్నింటిని నిర్మిస్తాను.

► మీ సినిమాలు వేరే భాషలో విడుదల కాకపోయినా ఒక్క తెలుగులోనే మీ మార్కెట్‌ 150 కోట్ల వరకూ ఉంటుంది. అది గర్వంగా ఉంటుందా?
ప్రౌడ్‌గాను ఉంది. అలాగే టెన్షన్‌గానూ ఉంది. థియేట్రికల్‌ బిజినెస్‌ 130 కోట్లు వరకూ జరిగినప్పుడు కలెక్షన్స్‌ 150–160 కోట్లు ఉన్నప్పుడే బయ్యర్స్‌ అందరూ హ్యాపీగా ఉంటారు. అలా ఉండాలంటే సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అయి తీరాలి. వేరే ఆప్షన్‌ లేదు.

► మేడమ్‌ తుస్సాడ్స్‌వాళ్లు తయారు చేసిన మీ స్టాచ్యూ చూసి మీ వైఫ్, పిల్లలు ఎలా రియాక్ట్‌ అయ్యారు?
నమ్రతా రియాక్షన్‌ కంటే సితార మా పాప రియాక్షన్‌ మాత్రం ప్రైస్‌లెస్‌. స్టాచ్యూ అంటే ఏదో అనుకుంది కానీ చూసి షాక్‌ అయింది. ఫస్ట్‌ టైమ్‌ ఆ బొమ్మను చూసినప్పుడు తను ఇచ్చిన రియాక్షన్‌ మర్చిపోలేనిది.

► దర్శకుడు సుకుమార్‌తో మీ సినిమా సడన్‌గా ఎందుకు క్యాన్సిల్‌ అయ్యింది?
సుకుమార్‌గారు, నేను ముందు సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ వరుసగా అన్నీ సోషల్‌ మెసేజ్‌లు, ఇంటెన్స్‌ సినిమాలు చేస్తున్నాను అనిపించింది.  అందుకే అనిల్‌ రావిపూడిగారి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని అనుకున్నాను. నాకు కొత్తగా, ఫ్రెష్‌గా నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చినట్లు ఉంటుందనుకున్నాను. అదే సుకుమార్‌గారితో చెప్పను. చెరో సినిమా చేశాక మళ్లీ కలిసి సినిమా చేద్దామనుకున్నాను.

► అనిల్‌ రావిపూడి సినిమా మీ ఫ్యాన్స్‌ సలహా మేరకు అంగీకరించారా?
‘మహర్షి’ తర్వాత అనిల్‌తో సినిమా చేయా లన్నది నా ఛాయిస్‌. ఆ సినిమా జూన్‌ ఎండ్‌ నుంచి స్టార్ట్‌ అవుతుంది.  ‘దూకుడు’ తర్వాత ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ చేయలేదు. ఇలాంటి సినిమా నేను చేసి చాలా రోజులు అయింది.


మైనపు బొమ్మ ఆవిష్కరణలో భార్యాపిల్లలతో మహేశ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top